ఐ.ఎన్.ఎక్స్. మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. అంతకుముందు, ఇవాళ్ల పార్లమెంటు సమావేశంలో కూడా పాల్గొన్నారు. 106 రోజులు జైలు జీవితం అనుభవించారు కాబట్టి ఆయనేదో నీరసపడతారనీ, భారీ స్కామ్ లో ఇరుక్కున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి… పార్టీపరంగా ఈ అంశం కాంగ్రెస్ కి మరింత మైనస్ అవుతుందనే అభిప్రాయాలు చాలానే వినిపించాయి. అయితే, ఈ తరహా విశ్లేషణలూ విమర్శలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా, అధికార పార్టీకి ఇదేదో అడ్వాంటేజ్ అవుతుందన్న అంచనాలు తప్పు అనే విధంగా… ఒక రకమైన వ్యూహాత్మక దూకుడుని ఇవాళ్ల ప్రదర్శించారు చిదంబరం. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందంటూ మండిపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై లేనిపోని కారణాలను భాజపా సర్కారు వెతికే ప్రయత్నం చేస్తోందనీ, దీనికి కారణాలన్నీ వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల్లోనే ఉన్నాయని అన్నారు చిదంబరం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, ట్యాక్స్ టెర్రరిజమ్, కీలక నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి ఆఫీస్ మాత్రమే తీసుకోవడమే అసలు కారణాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణాలను ఇకపై వరుసగా వివరించి దేశ ప్రజలకు చెబుతాననీ, ప్రతీ అంశంపై వ్యాసాలు రాస్తాననీ, ప్రెస్ మీట్లు పెడతానని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏనాడూ మాట్లాడింది లేదన్నారు. ఉల్లిధరలు పెరిగిపోయి సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఇవాళ్ల సామాన్యుల జీవనంతోపాటు, దేశంలోని అన్ని వ్యవస్థలూ భాజపా పాలనలో నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు.
106 రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ… తీహార్ జైల్లో గడపడంతో తనలో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందన్నారు. దీంతోపాటు శరీరం కూడా దృఢ పడిందనీ, ప్రతీరోజూ ఒక బల్లపై పడుకోవడం వల్ల నడుం నొప్పి, మెడ నొప్పి కూడా తగ్గిందన్నారు. అన్నిరకాలుగా తాను ఇప్పుడు మరింత దృఢంగా ఉన్నా అన్నారు చిదంబరం. తన అరెస్టు, జైల్లో గడిపిన రోజులు… ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వ్యక్తిగతంగా తనపైగానీ, పార్టీపరంగా కాంగ్రెస్ పై ఎలాంటి మరకా పడకుండా… మరింత బలపడి బయటకి వచ్చాననే పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు చిదంబరం. మోడీ పాలనపై వరుసగా ప్రశ్నించడం మొదలుపెడతా అంటున్నారు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో చూడాలి.