దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తోందనీ, తెలంగాణలో చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయంటే కారణం మోడీ సర్కారు పక్షపాత బుద్ధేనని మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై స్పందించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నిజానికి, కేంద్రం నిధుల విషయంలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకే మాట భాజపాది. ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువే ఇస్తున్నామనీ, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరనీ, మీరే మ్యాచింగ్ గ్రాంటులు సమకూర్చుకోలేకపోతున్నారని! లక్ష్మణ్ కూడా ఇదే వాదన వినిపించారు.
ఢిల్లీ వెళ్తే అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుంటారనీ, ఇక్కడికి వచ్చేసరికి కన్నీళ్లు కారుస్తూ వాపోతూ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆరు సంవత్సరాలుగా ధనిక రాష్ట్రమంటూ చెప్పుకుని వచ్చి, ఇవాళ్ల రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకే నెపాన్ని నెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. ఢిల్లీకి వెళ్లి నిధులు, పథకాలు, ప్రాజెక్టులు మంజూరు చేసుకుని వస్తుంటారనీ.. అలాంటి సమయంలో కేంద్రాన్ని మెచ్చుకుంటూ కితాబులివ్వడం, ఆ తరువాత ఇలా విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయిందన్నారు. హైదరాబాద్ లోని రక్షణ శాఖ భూములపై మీరు కన్నేశారనీ, వాటిని ఎలాగోలా చేజిక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారన్నారు. ఉన్న సెక్రటేరియట్ ని వదిలేసి రక్షణ భూముల్లో కడతామనీ, అసెంబ్లీ మారుస్తామనే ప్రయత్నాన్ని కేంద్రం అడ్డుకునేసరికి కేటీఆర్ విమర్శలు మొదలుపెట్టారన్నారు. రక్షణ శాఖకు సంబంధించి హైదరాబాద్ కే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందనీ, విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్శిటీ కడతామని ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వమే భూములు చూపించలేదన్నారు.
నిధుల విషయంలో శాఖలవారీగా కేంద్రం ఎంతెంత ఇచ్చిందో చర్చించడానికి కేటీఆర్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు లక్ష్మణ్. రైల్వే ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, రాష్ట్రమే మేచింగ్ గ్రాంట్స్ విడుదల చేయలేదన్నారు. కేంద్ర నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని కూడా లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర కేటాయింపులు అనగానే ఎప్పుడూ విద్యా సంస్థల గురించే చెబుతూ ఉంటారు భాజపా నేతలు! తెలంగాణకి అన్ని చేశాం ఇన్ని చేశాం అంటున్నారుగానీ… రాష్ట్రం అడుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాగానీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, విభజన చట్టంలోని పెండింగ్ ఆస్తుల పంపకాలుగానీ… ఇవన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వీటిపై భాజపా నేతలు మాట్లాడరు. ఇవన్నీ పెట్టుకుని చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారు లక్ష్మణ్.