తెలంగాణలో విపక్ష పార్టీలకు సరైన రాజకీయ పోరాటాంశం ఎప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన పరిస్థితే! ఏదో ఒక అంశం తలకెత్తుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచేస్తాం చించేస్తాం అంటూ బయల్దేరడం, ఆరంభశూరత్వం అనంతరం చతికిలపడటం. ఇదే జరుగుతూ వస్తోంది. ఇటీవల ఆర్టీసీ సమ్మె అంశం కూడా ఇలానే తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఇదే ఆయుధం అన్నారు. కానీ, చివర్లో కేసీఆర్ ఇచ్చిన ట్విస్ట్ దెబ్బకి కాంగ్రెస్, భాజపా నాయకులు ఒక్కసారిగా తెల్లముఖాలు వెయ్యాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేసే ఒక బలమైన అంశం కోసం అన్వేషణలో రెండు పార్టీలూ పడ్డాయనిపిస్తోంది. తెలంగాణలో మద్య నిషేధం అనే నినాదాన్ని తెరమీదికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి.
గాంధీ భవన్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు మద్య నియంత్రణపై చర్చించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మద్యం దుకాణాలను బంద్ చేయాలన్నారు మల్లు భట్టి విక్రమార్క. మద్యం అమ్మకాలు పెరిగిపోవడం వల్లనే మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ మధ్య ప్రతీ నేరఘటన వెనకా మద్యం ప్రభావం ఉంటోందన్నారు. రాష్ట్రానికి ఆదాయం వస్తే చాలు, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనీ, నియంత్రణ అవసరమంటూ ఉద్యమిస్తామన్నారు. భాజపా నేతలు కూడా ఇదే టాపిక్ తీసుకున్నారు. మద్యంపై ఒక ఉద్యమం చేయాలన్నది భాజపా ఆలోచన అన్నారు ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ. దీన్లో భాగంగా వచ్చేవారంలో రెండు రోజులపాటు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధంవైపు ఉద్యమాన్ని నడిపించడం కోసం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు సహకరించాలన్నారు.
దిశ ఘటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇలా స్పందించాయి. మద్యం అమ్మకాలపై నియంత్రణ, జాతీయ రహదారులకు సమీపంలో దుకాణాలు సంఖ్య తగ్గింపు మీద ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రాగలిగితే మంచిదే. అయితే, దీన్ని కూడా ఎవరికివారే అన్నట్టుగా భాజపా, కాంగ్రెస్ నేతలు విడివిడిగా కార్యక్రమాలకు రెడీ అవుతున్నాయి. పోరాటం ద్వారా వచ్చే రాజకీయ లబ్ధి తమకు మాత్రమే దక్కాలన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అందర్నీ కలుపుకునిపోయే కార్యాచరణకు సిద్ధం కావడం లేదు. ప్రతిపక్షాల్లో లోపించిన ఐకమత్యం వల్లనే ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగే స్థాయి పోరాటాలను ఇంతవరకూ చేయలేకపోయాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో లోపించిందీ ఇదే. మరి, మద్యంపై పోరాటాన్ని ఏ స్థాయి చర్చనీయం చేస్తారో చూడాలి.