రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి కనీసం 30వేల ఎకరాలన్నా ఉండేలా చూసుకోండి.. అని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు.. అసెంబ్లీలో చేసిన సలహా ఇది. విజయవాడ రాజధానిగా తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని ఆయన ప్రకటించారు. కానీ.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ అధికార ప్రతినిధులు.. స్వయంగా మంత్రులు… అమరావతి నిర్మాణ బాధ్యతలు ఉన్న శాఖల మంత్రులు కూడా.. అమరావదికి పదిహేను వందల ఎకరాలు చాలని.. చంద్రబాబు 35వేల ఎకరాలు సేకరించారని.. ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ రెండు నాల్కల ధరోణే.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని విషయంలో.. ఎంతో మంది ఎన్నో రకాల అభిప్రాయాలు చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. ఎవరు ఎలాంటి కమిటీలు, అభిప్రాయాలు ఇచ్చినా.. అది ఆంధ్రప్రదేశ్తో నేరుగా సంబంధం లేని వారే. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. రాష్ట్రం మధ్యలో ఉంటుందని.. రాజధానికి కావల్సిన అన్ని సౌకర్యాలుంటాయని అంచనా వేసి… అమరావతిని ఖరారు చేసింది. దీనిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అసెంబ్లీ సాక్షిగా సమర్థించారు. పైగా.. రాజధానికి కనీసం 30వేల ఎకరాలుండాలనే సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు… అంత భూమిని రాజధాని రైతులు స్వచ్చందంగా ఇచ్చిన తర్వాత అదే వైసీపీ నేతలు.. అంత భూమి అవసరం లేదంటూ.. కొత్త పాట అందుకోవడం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
అమరావతి రాజధానిగా ఉండటం.. వైసీపీకి.. జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం ఇష్టం లేదు. గత ఆరు నెలలుగా.. అమరావతి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలతోనే ఈ విషయం స్పష్టమవుతోంది. కానీ.. దాన్ని తరలించలేక… కొనసాగించలేక.. ఏ నిర్ణయం తీసుకోలేక తంటాలు పడుతోంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర భవిష్యత్ పై.. ఆర్థిక ప్రగతిపై.. ప్రభావం చూపుతుంది. ఈ విషయం ఇప్పటికే స్పష్టమయింది. కానీ.. ఏపీ అభివృద్ధి కన్నా.. కుల రాజకీయాలు.. ఇతర అంశాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ… తన గత అభిప్రాయాలపైనే యూటర్న్ తీసుకోవడం ప్రజల్ని సైతం విస్మయానికి గురి చేస్తోంది.