దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ తర్వాత దేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన ఇతర ఘటనల్లోనూ.. ఇలాంటి శిక్షలే అమలు చేయాలంటూ.. డిమాండ్లు వినిపించడం ప్రారంభించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఏదైనా చట్ట ప్రకారం జరిగితేనే ప్రజలకు రక్షణ. అందుకే.. కేంద్రం.. శరవేగంగా స్పందించింది. మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలను శరవేగంగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. 1,023 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు నిర్ణయించింది. ఒక్కో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏడాదికి కనీసం 165 కేసులు పరిష్కరించనుంది.
బాధితులకు న్యాయం ఆలస్యం అయితే.. అన్యాయం చేసినట్లే…! ఈ లెక్క మన దేశంలో బాధితులు అందరూ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే.. ప్రజల్లో అసహనం కనిపిస్తోంది. సంచలనాత్మకమైన కేసులు వెలుగు చూసినప్పుడు.. నిందితుల్ని తక్షణం అంతమొందించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తక్షణ న్యాయం… తక్షణ శిక్షలు ఈ దేశంలో అసాధ్యంగా మారిపోయాయి కాబట్టి.. ప్రజలూ.. దీనికి మద్దతు పలుకుతున్నారు. చట్టాన్ని లెక్కలోకి తీసుకోకుండా… బాధితులకు న్యాయం అందించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నారు. ప్రజల సెంటిమెంట్ల ఆధారంగా నడిచే ప్రభుత్వాలకు.., ప్రజలే బలంగా కోరినవి చేసి.. వారి మద్దతు కూడగట్టుకోవడమే పని. వారే చట్టాలను ఉల్లఘించాలని డిమాండ్ చేస్తున్నప్పుడు.. వారికి అడ్డం ఏముంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
పరిస్థితి చేయి దాటక ముందే కేంద్రం… కాస్త కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. చట్టం ద్వారా.. న్యాయం జరగదని ప్రజలు భావించాల్సిన పరిస్థితి వస్తే.. దాని వల్ల సమాజంలో అశాంతి పెరుగుతుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని న్యాయం చేయడం.. బాగుందని ప్రజలు ఓ నిర్ణయానికి వస్తే.. దాని వల్ల జరిగే పరిణామాలు ఊహించడం కష్టం. అందుకే కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.