సోషల్ మీడియా జనాల అత్యుత్సాహం… పోలీసులకు చిక్కులు తెచ్చి పెడుతోంది. ” దిశ ” హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పోలీసులు కావాలని చేసిందంటూ.. ప్రజా అభిప్రాయాన్ని గౌరవించారని.. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ పోలీసులు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నలుగుర్ని హతమార్చడం అంటే.. చాలా తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. అయితే. పోలీసులు ఈ విషయంలో నిమిత్తమాత్రులయ్యారు. ” దిశ ” హత్య కేసు నిందితులు ఎన్కౌంటర్ అయ్యారన్న సమాచారం బయటకు వచ్చినప్పటి నుండి.. పోలీసులు ” దిశ ” కు న్యాయం చేశారనే ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఏ ఒక్కరు కూడా.. దాన్ని రియల్ ఎన్కౌంటర్ అన్న ఉద్దేశంలో చెప్పలేదు. ఎవరూ నమ్మడం లేదు కూడా. తీసుకెళ్లి కాల్చి చంపారనే నమ్ముతున్నారు. అలాగే ప్రచారం చేస్తున్నారు.
అయితే.. పోలీసులు మాత్రం.. అది నిజమైన ఎన్‌కౌంటరేనని.. కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి.. మరీ అసలేం జరిగిందో.. సీన్ టు సీన్ వివరించారు. కాల్పుల్లో మరణించిన ఇద్దరు నిందితుల చేతుల్లో తుపాకీలు కూడా ఉన్నాయి. కావాలని ఉద్దేశపూర్వకంగా చంపలేదని… వారు తప్పించుకుని పోయే ప్రయత్నం చేయడంతోనే కాల్చేశామని.. వారి దాడిలో… ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని.. వారు కేర్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని.. కమిషనర్ సజ్జనార్ చెప్పుకొచ్చారు. కానీ.. ఆయన మాటలు మీడియాకు ఎక్కలేదు. ఆయనను పొగడటానికి ఆయనేదో సినిమా కథ చెబుతున్నట్లుగా ఫీలయ్యారు.
ఇప్పుడు.. ఎన్కౌంటర్ చేయడాన్ని మెజార్టీ జనాలు ఆహ్వానిస్తున్నారు. కానీ.. కొన్ని వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. చట్టంతో ఇక పని లేదా..? పోలీసులే ఇన్స్టంట్ న్యాయం అమలు చేస్తారా..? అయితే.. ఇక కోర్టులు.. విచారణలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజకీయ పావులుగా పోలీసులు మారిపోతున్నారని ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. ఇప్పుడు డిమాండ్లు వచ్చాయి కదా.. అని.. ఇలా నిందితుల్ని వాళ్లే ఎన్ కౌంటర్ చేస్తూ.. పోతే.. భవిష్యత్‌లో అవి ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో.. ఊహించడం కష్టం. అందుకే.. పోలీసులు కూడా… ఇది తాము కావాలని చేసిన ఎన్కౌంటర్ కాదని.. ఆత్మరక్షణ కోసమేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం.. ఆ క్రెడిట్‌ను తెలంగాణ పోలీసులకు ఇచ్చేందుకు.. వారిని ముంచేస్తున్నారు.