గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల్లో… అవినీతిని బయట పెట్టలేకపోయినా.. లొసుగులు ఉన్నాయని ప్రచారం చేయాలనకుంటున్న ఏపీ సర్కార్ పెద్దల తీరు.. ఉన్నతాధికారుల్లో చిచ్చుకు కారణం అవుతోంది. సచివాలయంలో ఉన్నతాధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారని… ఒకరంటే.. ఒకరు పడని పరిస్థితికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట… ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు… చాంబర్లోనే గొడవపడినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అరుచుకుంటూ.. వారు పేషీ మొత్తం గందరగోళం సృష్టించారని చెబుతున్నారు. ఈ గొడవకు.. కారణం.. వారి వ్యక్తిగత విషయాలు కాదు. కనీసం.. అధికారిక వ్యవహారాలు కూడా కాదు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను.. అసంబద్ధంగా.. నష్టదాయకంగా పేర్కొంటూ… కొన్ని నోట్లు రెడీ చేయడమే.
గత ప్రభుత్వంలో ఓ కీలక శాఖలో పని చేసిన ఐఏఎస్ అధికారి… కొత్త ప్రభుత్వంలో అప్రాధాన్యశాఖకు బదిలీ అయ్యారు. ఆయన గతంలో నిర్వహించిన శాఖలో అవినీతి, అవకతవకలు వెలికి తీసేందుకు పాత నిర్ణయాలన్నింటినీ పరిశీలన చేస్తున్నారు. ఏదో ఒకటి వెలికి తీయాలన్న ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో… కొన్ని నిర్ణయాలు అసంబద్ధమైనవి.. వాటి వల్ల నష్టం జరిగిందనే నివేదికను .. ప్రస్తుతం.. ఆ కీలక శాఖను చూస్తున్న అధికారి సిద్ధం చేశారు. ఇది తెలిసిన.. సీనియర్ అధికారి..నేరుగా ఆయన చాంబర్ కు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. నిబంధనల ప్రకారం తీసుకున్న నిర్ణయాలపై.. అలా ఎలా నోట్ తయారు చేస్తారని మండిపడినట్లుగా తెలుస్తోంది.
ఈ ఇద్దరు అధికారుల సమస్య కాదు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పోస్టులు పొందిన వారందరికీ.. గతంలో తీసుకున్న నిర్ణయాల లొసుగుల్ని బయట పెట్టడం… ఓ మిషన్ గా మారింది. కనీసం.. ఫలానా నష్టం జరిగిందన్న ప్రచారం చేసుకునేందుకు వీలుగా అయినా.. నివేదిక ఇవ్వాలన్న సూచనలు వెళ్లాయని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే నివేదికలు సిద్ధం చేస్తున్నారని.. ఇది అధికారుల మధ్య… స్పష్టమైన విభజనకు కారణం అవుతోందని అంటున్నారు. రాజకీయ కారణాలతో తమను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగుతున్నారని… ఓ వర్గం అధికారులు ఆక్షేపిస్తున్నారు. ఈ కోల్డ్ వారు.. అధికారుల్ని రెండు వర్గాలుగా మార్చింది. దీంతో ఏపీ సచివాలయంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు.