ఎట్టకేలకు వర్మ సినిమా `అమ్మరాజ్యంలో కడపబిడ్డలు`కి మోక్షం లభించింది. సెన్సార్ సమస్యల నుంచి గట్టెక్కింది. దాంతో విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈనెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. కొద్దిసేపటి క్రితమే సెన్సార్ బోర్డు సినిమా చూసి – కొన్ని కట్స్‌తో U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. అభ్యంతరకరమైన సన్నివేశాల్ని కొన్ని తొలగించాలని సూచించింది. చాలా చోట్ల మ్యూట్లు పడ్డాయి. మొత్తానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ వచ్చేసింది. దాంతో హడావుడిగా చిత్రబృందం విడుదల తేదీ ప్రకటించేసింది.
నిజానికి ఈ సినిమా అంత త్వరగా సెన్సార్ ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందని ఎవరూ అనుకోలేదు. తొలగించాల్సిన సన్నివేశాల జాబితా ఎక్కువే కనిపించింది. ఎన్.వో.సీ తెచ్చుకోమని సెన్సార్ బోర్డు అడగనందు వల్ల వర్మ పని తేలికైంది. సెన్సార్ చెప్పిన సూచనలన్నీ పాటించి ఈ సినిమాని ట్రిమ్ చేస్తున్నారు. దాంతో మసాలా సన్నివేశాలు బాగా తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ సినిమాకి రావల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. దాంతో ఓపెనింగ్స్ బాగానే రాబట్టొచ్చు.