నెల్లూరు జిల్లా వైసీపీలో మొదటి సారి ధిక్కార స్వరం వినిపించిన.. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి.. వైసీపీ నెంబర్ -2 విజయసాయిరెడ్డి పరోక్షంగా అయినా.. గట్టి వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలను ధిక్కరించి ఎవరు మాట్లాడినా సరే చర్యలు తప్పవని.. ఘాటుగా హెచ్చరించారు. గతంలో పార్టీ గీతదాటిన వారిపై చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. పార్టీలో వ్యవహారాలపై అసంతృప్తి ఉంటే.. అంతర్గత వేదికపై చర్చించుకోవాలి కానీ.. మీడియాకు ఎక్కితే బాగుండదని స్పష్టం చేశారు. హైకమాండ్‌తో మాట్లాడుకోవడం ఉత్తమమన్నారు.
ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు నెల్లూరు రాజకీయాల్లో ప్రాధాన్యత లేకుండా పోయింది. నెల్లూరులో.. మొత్తం.. మంత్రి అనిల్ కుమార్ చక్క బెడుతున్నారు. మెట్ట ప్రాంతంలో.. మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హవా నడుస్తోంది. దీంతో.. ఆనం పూర్తిగా సైడైపోయారు. తన పరిస్థితి రాను రాను సైడ్ ఎమ్మెల్యేగా మారిపోతూండటంతో.. ఆయన రెబల్ వాయిస్ వినిపించడం ప్రారంభించారు. బెట్టింగ్, భూ, ఇసుక వ్యవహారాల్లో రాటుదేలిపోయిన వారిగా పేరున్న అనిల్ కుమార్, కోటంరెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి.. మాఫియా వ్యాఖ్యలు చేశారు. ఇది.. వైసీపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.
నెల్లూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు టీడీపీలో చేరిన సందర్భంగా… నెల్లూరుకు చెందిన పలువురు నేతలు … జగన్ నివాసానికి వచ్చారు. కానీ.. ఆనం రామనారాయణరెడ్డి మాత్రం రాలేదు. ఆయనను వైసీపీ నేతలు ఆహ్వానించలేదు. అసలు బీద మస్తాన్ రావును పార్టీలో చేర్చుకుంటున్న అంశంపై.. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వైఎస్ హయాంలోనే మంత్రిగా చేసి.. జిల్లాలో కీలక నేతగా ఉన్నప్పటికీ.. తనకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ఆనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఉంటే ఉండాలి.. లేకపోతే.. చర్యలు తీసుకుంటామని.. విజయసాయిరెడ్డి హెచ్చరించడంతో.. ఆనం ఎలా స్పందిస్తారనేది.. ఆసక్తికరంగా మారింది.