ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఏపీ సర్కార్ భారం మోపింది. ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు, సిటీ సర్వీసులకు కిలోమీటర్‌కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 20 పైసలు చొప్పున పెంచారు. ఎప్పటి నుంచి అమలు చేయాలన్నదానిపై రేపోమాపో నిర్ణయం తీసుకోనున్నారు. పెంచాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. బహుశా.. ఒకటి, రెండు రోజుల్లోనే… అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని అందుకే పెంచక తప్పడం లేదని.. రవాణా మంత్రి పేర్నీ నాని చెప్పుకొచ్చారు. ఒక వేళ చార్జీలు పెంచకపోతే.. ఆర్టీసీ దివాలా తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెతో.. దాదాపుగా రెండు నెలల పాటు.. ఆర్టీసీ కార్యాకలాపాలు నిలిచిపోయాయి. తర్వాత సమ్మెను విరమించేందుకు కార్మిక సంఘాలు సిద్ధమైనా.. కేసీఆర్ మాత్రం ససేమిరా అన్నారు. తర్వాత విధుల్లో చేరేందుకు అంగీకరించి… కార్మికులకు వరాలు ప్రకటించారు. కానీ ప్రయాణికులపై భారం మోపారు. ఏటా రూ. ఏడు వందల కోట్లకుపైగా.. ఆదాయం వచ్చేలా.. చార్జీలు పెంచారు. ఈ పెంపు.. ఆదాయం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది. వెంటనే.. ఆర్టీసీ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనలు పెట్టడం.. ఆ తర్వాత జగన్ ఆమోద ముద్ర వేయడం జరిగిపోయింది.
ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల్ని ఆర్టీసీలో విలీనం చేస్తామని ప్రకటించారు. అంటే.. ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు అంతా ఆర్టీసీకి కలిసి వస్తుంది. దీంతో సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని.. చార్జీలు పెంచకుండానే… ఆర్టీసీని లాభాల్లోకి నడిపించవచ్చని.. కార్మిక సంఘాలు కూడా భావించాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం మరో విధంగా ఆలోచించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఇంకా పూర్తి చేయకపోయినా.. .. చార్జీలను బాదేశారు.