కమర్షియల్ సినిమాకి ఏం కావాలి?
యాక్షన్, పాటలు, రొమాన్స్, కామెడీ, అందులో కొంత ఎమోషన్. దానికి ఇంకొంచెం దేశభక్తి జోడిస్తే – ఇక తిరుగు ఉండదు. ‘వెంకీ మామా’ కూడా ఇదే ప్యాకేజీతో వస్తోంది. వెంకటేష్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రమిది. బాబి దర్శకుడు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలు. ఈనెల 13న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది.
మనిషి తలరాతని రాసే శక్తి ఆ దేవుడికి ఉందని నీ నమ్మకం
ఆ తలరాతని తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకుందని నా నమ్మకం – అనే వెంకీ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. అంటే ఇందులో దైవశక్తికి సంబంధించిన ఫాంటసీ అంశాలూ ఉన్నాయన్నమాట.
నీ లవ్ స్టోరీ చాలా అందంగా ఉందిరా – అంటూ మేనల్లుడి ప్రేమకథని విని మావయ్య మురిసిపోతే
మావయ్యని పెళ్లి బట్టల్లో చూడాలనివుందిరా – అంటూ మేనల్లుడు ఫిక్సయిపోతాడు.
ఆ మావయకు తగిన పిల్లని వెదికి పట్టుకోవడానికి మేనల్లుడు చేసే ప్రయత్నాలన్నీ తెర పై చూడాల్సిందే.
మీకు ముడ్డి కడగడం వచ్చా అండీ.. అంటూ వెంకీ కాస్త లిమిట్ క్రాస్ చేసి డైలాగ్ పేల్చినా అది వెంకీ స్టైల్ ఆఫ్ హ్యూమర్ అని సర్దుకుపోవాల్సిందే. వెంకీ కామెడీ టైమింగ్‌కి ఈ పాత్రలో మరింత పని దొరికినట్టు అనిపిస్తోంది. కామెడీ పంచడంలో ఈసారి పాయల్ రాజ్ పుత్ కూడా వాటా అందుకుంది. ‘మీరే ఎలాగైనా దేఖ్నా హై’ అంటూ సగం తెలుగు సగం హిందీ డైలాగులతో కాస్త ఫన్నీగానే ఆ పాత్రని తీర్చిదిద్దారు. వెంకీ, చైతూ కలసి డాన్సులు వేయడం, ఫైటింగులు చేయడం దగ్గుబాటి అభిమానుల్ని మరింతగా అలరిస్తుంది. ‘ఈసారి జాతరని రంగులతో కాదు, మీ రక్తంతో ఎరుపెక్కిస్తా’ అంటూ పవర్ఫుల్ డైలాగ్ వదిలాడు వెంకీ. జాతకరీత్యా మామా అల్లుళ్లు విడిపోవాల్సి రావడం, మళ్లీ వాళ్లు కలుసుకోవడం – ఇదే స్థూలంగా వెంకీ మామ కథ. దాన్ని దర్శకుడు అన్ని కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దాడు. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా కాబట్టి – రిచ్‌గానే ఉంది. ఫ్రేములన్నీ కలర్‌ఫుల్లుగా, భారీగా కనిపిస్తున్నాయి. మొత్తానికి వినోదాల విందు ఖాయం అనిపిస్తోంది.