చటాన్‌పల్లి ఎన్కౌంటర్ దేశంలో కొత్త తరహా ఉద్యమాలకు కారణం అవుతోంది. రేప్ కేసులు నమోదైన చోటల్లా.. నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలంటూ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఎక్కడిక్కడ ఊపందుకుంటున్నాయి. తెలంగాణలో కూడా… మరో ఎన్ కౌంటర్ డిమాండ్‌తో.. ప్రజలు రోడ్లెక్కారు. ఆదిలాబాద్ జిల్లాలో… టేకు లక్ష్మి దళిత మహిళను.. కొంత మంది యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. దిశ ఘటన జరిగినప్పుడే ఇది కూడా జరిగింది. కానీ మీడియాలో హైలెట్ కాలేదు. వారు అత్యంత నిరుపేదలు కావడం… మరుమూల గ్రామంలో జరగడంతో.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఎప్పుడైతే.. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారో.. అప్పుడే.. సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభమయింది. దళిత మహిళ అనే కారణంగానే న్యాయం చేయడంలో నిరాదరణ చూపిస్తున్నారా.. అంటూ… ప్రజలు రోడ్డెక్కారు. నిన్న బంద్ కూడా నిర్వహించారు. రాజకీయ నేతల పరామర్శలు కూడా.. టేకు లక్ష్మి కుటుంబానికి ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో మాత్రమే కాదు.. దేశంలో ఇతర చోట్ల కూడా.. అవే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సినీ నటి ప్రత్యూష తల్లి, వైఎస్ హయాంలో దారుణహత్యకు గురైన ఆయేషా మీరా తల్లి లాంటి వారు తెరపైకి వచ్చారు. తమ కూతుళ్లపై దారుణాలకు పాల్పడిన వారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరో ఘటన.. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి సజీవ దహనం. వారిని కూడా.. ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. రేప్ కేసుల్లో ఉన్న నిందితులందర్నీ.. అలాగే శిక్షించాలని… చటాన్ పల్లి ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అందరికీ అదే న్యాయం అమలు చేయాలంటున్నారు.
ప్రజలు భావోద్వేగంలో ఉన్నారు. వారు చంపేయాలని డిమాండ్ చేశారు. చంపేయలేకపోతే.. తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గారో… ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలనుకున్నారో.. వారి భావోద్వేగాలకు తగ్గట్లుగా వ్యవహించి.. ప్రశంసలు పొందాలనుకున్నారో కానీ.. ఎన్కౌంటర్ చేసేశారు. నిందితులు తిరుగుబాటు చేయడం వల్ల.. ఆ ఎన్కౌంటర్ జరిగిందని..ఒక్కరంటే ఒక్కరూ నమ్మడం లేదు. కావాలనే చేశారని.. అందరూ అంటున్నారు. ఇప్పుడా భావోద్వేగం అన్ని రేప్ కేసుల్లోనూ కనిపిస్తోంది. విచారణలాంటివేమీ లేకుండా… ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఇదే చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది.