ఎన్కౌంటర్ను సమర్థిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలను .. సీపీఐ నేత నారాయణ వెనక్కి తీసుకున్నారు. నిజానికి నారాయణ.. ఎన్కౌంటర్ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడే కలకలం రేపింది. కమ్యూనిస్టులు.. ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అది ఎలాంటి సందర్భంలో అయినా.. ఎన్కౌంటర్లు అనేది.. కచ్చితంగా తప్పని వాదిస్తూంటారు. అలాంటి భావజాలం ఉన్న పార్టీలో జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్న నారాయణ.. దిశ హత్య కేసు నిందితుల్ని సమర్థించడం.. సహజంగానే.. ఆయా భావజాలం ఉన్న పార్టీల్లో కలకలం రేపింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ.. నారాయణపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీకి, ప్రజలకు నారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ విధానాలకు భిన్నంగా తన వ్యాఖ్యలు ఉండటంతో తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు.
సీపీఐ సీనియర్ నేత నారాయణ.. ఉన్నది ఉన్నట్లుగా.. మాట్లాడే రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే అప్పుడప్పుడూ ఆయన చేసే కామెంట్లు వివాదాస్పదమవుతూ ఉంటాయి. తాజాగా.. దిశ హత్య కేసులో.. నిందితుల్ని ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల్ని సమర్థిస్తూ.. అందరి కన్నా ముందుగా ఓ ప్రకటన చేశారు. ఎన్కౌంటర్ చేసి మంచి పని చేశారని.. శభాష్ అన్నారు. నిజానికి ఈ ఎన్కౌంటర్పై.. సామాన్య జనాలు, సోషల్ ప్రజలు మాత్రమే.. భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి నారాయణ టెంప్ట్ అయినట్లుగా ఉన్నారు. వెంటనే.. ఎన్కౌంటర్ను సీపీఐ సమర్థిస్తోందని ప్రకటించేశారు.
ఎన్కౌంటర్కు ప్రజల నుంచి వచ్చిన పాజిటివ్ స్పందన చూసిన… రాజకీయ పార్టీలు.. సంయమనం పాటిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదన్నదే పార్టీల విధానం. ఏదైనా చట్ట ప్రకారం జరిగితేనే ప్రజలకు రక్షణ ఉంటుంది. ఓ సారి ఉల్లంఘన జరిగితే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే.. రాజకీయ పార్టీలు.. ఇప్పుడిప్పుడే.. ప్రజల్లో భావోద్వేగం తగ్గిన తర్వాత.. స్పందించడం ప్రారంభించాయి.