అత్యాచారాలకు పాల్పడిన వారిని తక్షణం ఎన్కౌంటర్ చేసి పారేస్తే… మరోసారి అలాంటి నేరాలు చేయడానికి భయపడతారంటూ…వచ్చిన విశ్లేషణలు.. తేలిపోతున్నాయి. దిశపై హత్యాచారానికి పాల్పడిన మృగాళ్లు నలుగురిని ఎన్కౌంటర్ చేసేసినా.. ఆ ఎన్కౌంటర్ రచ్చ ఇంకా జరుగుతున్నా.. అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా.. అత్యాచారాల కేసులు, ఆగడాలపై.. చర్చ జరుగుతున్నా… మృగాళ్ల తీరులో మార్పు రాలేదు. తిరుపతిలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ పధ్నాలుగేళ్ల బాలికను..లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వీరిలో ఒకరు రౌడీషీటర్.
తిరుపతి పద్మావతిపురం సర్కిల్ వద్ద పద్నాలుగేళ్ల మైనర్ బాలిక తిరుచానూరుకు వెళ్లేందుకు అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు చిత్తూరు వెంకటేశ్‌ను లిఫ్ట్ అడిగింది. ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్తూ అతని స్నేహితుడూ, రౌడీషీటర్ అయిన రాజానాయక్‌కు సమాచారం ఇచ్చాడు. తిరుచానూరులో వాహనాన్ని ఆపకుండా సమీపంలోని ముండ్లపూడిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ఇది మాత్రమే కాదు.. విజయవాడలోనూ ఓ చిన్నారిపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోనూ.. ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే.. దిశ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అందుకే.. ఆ కేసులో.. నిందితుల్ని.. ఉన్న పళంగా ఎన్ కౌంటర్ చేసేసి.. న్యాయం చేశామనిపించారు. వాళ్లను అలా చంపేస్తే.. ఇతర చోట్ల నేరాలు చేసే వారికి భయం వస్తుందన్న అభిప్రాయాలు అంతటా వినిపించాయి. కానీ.. అలాంటిదేమీ ఉండదని.. తరచూ వెలుగు చూస్తున్న అత్యాచర ఘటనలు నిరూపిస్తున్నాయి.