భారతీయ జనతా పార్టీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దాదాపుగా ఎక్కడా లేదు. ఎవరైనా ఆ పార్టీలో చేరడమే కానీ… ఆ పార్టీ నుంచి ప్రత్యర్థి పార్టీల్లో చేరడం ఉండదు. చేరతామన్నా… ఆయా పార్టీలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తాయి. కానీ ఏపీలో మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. బీజేపీ నేతలను.. పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ముఖ్యనేత గోకరాజు గంగరాజు కుటుంబం అంతా వైసీపీలో చేరబోతోంది. గోకరాజు గంగరాజు నర్సాపురం నుంచి 2014లో ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకపోవడంతో పోటీ చేయడానికి నిరాకరించింది.
గోకరాజు గంగరాజు.. ఆరెస్సెస్ కీలక నేతలకు ఆప్తుడు. ఆయన బీజేపీ రాజకీయాల్లో పరిమితంగానే ఉంటారు కానీ.. ఆరెస్సెస్, వీహెచ్పీ వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయనను.. ఆయన కుటుంబాన్ని బీజేపీ నుంచి విడదీసి చూడలేం. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు.. ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయన పార్టీ మారుతారని.. ఊహించడం కష్టం. అయితే..ఇప్పుడు కూడా.. గోకరాజు గంగరాజు పార్టీ మారడం లేదని.. ఆయన కుటుంబం మాత్రమే.. వైసీపీలో చేరుతోందని చెబుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నేతల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు నయానా..భయానా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కేసులు, కూల్చివేతలతో కొత్త తరహా సందేశాలు పంపింది. కరకట్టపై ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్తో పాటు.. ఆయనకు ఉన్న కొన్ని వ్యాపారాల విషయంలో నోటీసులు అందాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. వారందర్నీ పార్టీలో చేర్పించుకోవడానికి ప్రణాళికా బద్దంగా ప్రయత్నించారని.. ఇప్పుడది సక్సెస్ అయిందని అంటున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు కూడా.. గోకరాజు కుటుంబం… వైసీపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది. కానీ.. అప్పుడు వైసీపీ నేతలు ఆ ప్రచారం చేసి.. వారిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ వారు మాత్రం.. అప్పుడు అంగీకరించలేదు. ఒప్పుడు అంగీకరించక తప్పలేదు.
తమ పార్టీ నేతల్ని బెదిరించి… మరీ.. వైసీపీలో చేర్చుకుంటున్నారన్న ఆగ్రహం ఆ పార్టీ ముఖ్యనేతలకు సహజంగా వస్తుంది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయడం లేదు. ఓ రకంగా.. కావాలనే.. బీజేపీని రెచ్చగొట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది. దీనికి వెనుక ఉన్న వ్యూహం మాత్రం బయటకు రావాల్సి ఉంది.