అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టీడీపీ ని ఎదుర్కోవడానికి వైసీపీ… బహుముఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు రాజకీయంగా.. ఇటు పాలనా పరంగా… రెండు అంటే.. రెండు వ్యూహాలు అమలు చేయబోతోంది. ఒకటి.. ఈ ఆరు నెలల్లో ఏం జరిగిదనే దాని కన్నా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిని ప్రతి అంశంలోనూ చర్చకు తేవడం… రెండు… ఇప్పటికే చర్చలు జరిపిన టీడీపీ ఎమ్మెల్యేలతో.. ఆ పార్టీపై ధిక్కార స్వరం.. తమ ప్రభుత్వంపై.. సానుకూల ప్రకటనలు చేయించుకోవడం. ఈ మేరకు.. ఇప్పటికే.. వైసీపీ అగ్రనేతలు కసరత్తు చేశారు. శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నారు.
175 మంది సభ్యులున్న అసెంబ్లీలో… వైసీపీకి 151 మంది ఉన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే బహిరంగంగానే మద్దతు పలికారు. ప్రతిపక్షానికి ఉన్నది అటూ ఇటూగా… 20 మంది మాత్రమే. మామూలుగా అయితే.. ఇది అసలు సంఖ్యే కాదు. ప్రతిపక్షాన్ని లెక్క చేయాల్సిన అవసరం.. అధికార పార్టీకి ఉండేది కాదు. కానీ.. వైసీపీ సర్కార్ మాత్రం.. 20మంది ఎమ్మెల్యేల ప్రతిపక్షాన్ని 150 మందితో ఎలా కట్టడి చేయాలన్నదానిపై… సుదీర్ఘ చర్చలు.. వ్యూహాలను ఖరారు చేసుకుంది. అధికారం బలంతో సర్వశక్తులు ఒడ్డుతోంది.
అధికారపక్షం అసహనమే… టీడీపీ అస్త్రంగా చేసుకోబోతోంది. ఆరు నెలల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తే.. అధికార పార్టీ నేతల్లో అసహనం తన్నుకొస్తోంది. బయట ప్రెస్మీట్లలోనే వారు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మరింత కంట్రోల్ దాటి పోతారు. దీన్నే టీడీపీ అస్త్రంగా చేసుకోనుంది. వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేక.. విమర్శల దాడికి.. ప్రత్యక్ష దాడికి దిగుతున్నారని.. ప్రజల ముందు పెట్టాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సమరంలో ఎవరి వ్యూహాలు వారివి. అపరిమిత బలంతో అధికారపక్షం.. ఉన్న కొద్ది మందిని కాపాడుకుంటూ విపక్షం… అసెంబ్లీలో తమ సత్తా చూపనున్నాయి.