జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసైనికులపై చిరాకుపడ్డారు. ఈలలు..గోలలతో.. చేస్తున్న హంగామాను చూసి.. ఆవేశపడ్డారు. ఒక్క సారిగా బ్లాస్టయ్యారు. మీలో క్రమశిక్షణ ఉంటే ఓడిపోయేవాళ్లం కాదని.. రుసరుసలాడారు. పవన్ అలాంటి మాటలు మాట్లాడటాన్ని.. ఆగ్రహించడాన్ని కూడా.. జనసైనికులు ఆస్వాదించారు. ఆయనేదో.. మరో సూపర్ డైలాగ్ చెప్పారనుకుని.. మళ్లీ ఈలలు వేసి.. గోలలు చేశారు. అది జనసైనికుల నైజం. ఎందుకంటే.. అది పవన్ కల్యాణ్ వద్ద నుంచే వారు నేర్చుకున్నారు. పవన్ మారితేనే వారు మారతారు.
ఇప్పటికీ ఫ్యాన్స్ “పవర్ స్టార్”నే చూస్తున్నారు..! ఫాలో అవుతున్నారు..!
పవన్ కల్యాణ్.. సినిమాల్లో సూపర్ స్టార్‌గా ఉంటూ రాజకీయ పార్టీ పెట్టారు. ఆయనకు సమాజం పట్ల బాధ్యత ఉంది. ఆయనలో ఫైర్ ఉంది. ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉంది. ప్రజలు కష్టాల్లో ఉంటే చలించిపోతారు. పేదలందరికీ ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం ఉంది. ఇవన్నీ ఆయన చెబితేనే తెలిసింది. ఇప్పటికీ.. ఇలాంటివన్నీ ఆయన చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ.. ఆయన స్టార్ గా ఎదిగింది మాత్రం… అలాంటి ఫైర్ ఉన్న కథాంశాలతో సినిమాలు తీసి కాదు. వెకిలి వేషాలు.. సొల్లు కామెడిలతో సినిమాలు తీసి.. ఆ అభిమానాన్ని సంపాదించుకున్నారు. సినిమాల్లో ఎలా ఉంటారోని జనసైనికులు బయట కూడా అలాగే ఊహించుకుంటున్నారు. అందుకే.. పవన్ కల్యాణ్‌ను.. వారు రాజకీయాల్లో కూడా… ఓ సినిమా స్టార్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఏం మాట్లాడినా ఈలలు..గోలలు వేస్తున్నారు. పవన్ ఎంత సీరియస్ మ్యాటర్ మీద మాట్లాడుతున్నారో వాళ్లు పట్టించుకోవడం లేదు.
పవన్ సీరియస్ రాజకీయాలు.. ఫ్యాన్స్‌కు ఎంటర్టెయిన్మెంట్ ఎందుకవుతున్నాయి..?
పవన్ కల్యాణ్ సినిమాలు వదిలేశారు. ఆయన పూర్తి సమయం… రాజకీయాలకే కేటాయించారు. ఇలాంటి సమయంలో.. ఆయన తన సినీ బ్యాక్‌గ్రౌండ్‌ను పూర్తిగా పక్కన పెట్టేయాల్సింది. అప్పటి నడవడికను.. వదిలించుకోవాల్సింది. తాను ఓ పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా మారిపోయానని… భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలనని.. ప్రజాసమస్యల పట్ల … షాట్ గ్యాప్‌లో మాదిరిగా కాకుండా.. సుదీర్ఘంగా పోరాడగలనని నిరూపించుకోవాలి. దురదృష్టవశాత్తూ పవన్ కల్యాణ్… ఓ సినిమా హీరోలా.. హడావుడి చేస్తున్నారు. ఆవేశ పడుతున్నారు. అది మొత్తం… ఆడియన్స్ చప్పట్ల కోసం సాగిపోతున్న వ్యవహారంలా ఉంటోంది. ఫలితంగా.. రైతు సమస్యల కోసం పోరాడినా… వరద బాధితులకు సాయం చేసినా.. అది ఫ్యాన్స్‌కు ఎంటర్టెయిన్మెంట్లానే కనిపిస్తోంది.
రాజకీయ హుందాతనం పవన్ చూపిస్తేనే ఫ్యాన్స్‌కు ఆదర్శం..!
పవన్ కల్యాణ్ రాజకీయ నేతగా హుందాతనం చూపించాల్సిన సమయం వచ్చింది. తను ఎలా ప్రవర్తిస్తే.. ఫ్యాన్స్ అలా రియాక్టవుతారు. ఆ విషయం ఆయనకు తెలియనిది కాదు. ఫ్యాన్స్ నుంచి ఎలాగైనా స్పందన రాబట్టవచ్చు కానీ.. ప్రజా స్పందనను రాబట్టలేరు. ఆయన చేస్తున్న ప్రకటనలు.. హావభావాల వల్ల … సాధారణ జనం కూడా ఆయన ఇంకా హీరో మూడ్‌లోనే ఉన్నారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చి.. తాను ఫ్యాన్స్ నే కాదు.. ప్రజల్ని కదిలించగల రాజకీయ నాయకుడ్నని.. నిరూపించుకోవాలంటే.. ముందుగా.. పవన్లోనే మార్పు రావాలి. ఆ మార్పును ఫ్యాన్స్ వైపు మళ్లించారు. అప్పుడే.. పవన్ కోరుకునే క్రమశిక్షణ కార్యకర్తల్లో .. ఫ్యాన్స్‌లో వస్తుంది.