దిశ ఘటన తరవాత ‘డయిల్ 100’ ప్రాచుర్యంలోకి వచ్చింది. దిశ ఆ రోజున పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఈ ఘోరం తప్పేదన్నది ఓ వాదన. అందుకే ‘100’ నెంబర్ని విస్కృతంగా ప్రచారం చేయాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. వంద నెంబరు పదే పదే గుర్తుకు వచ్చేలా ప్రకటనలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌లో హోర్డిగులు వెలుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబరు తప్పకుండా పనిచేస్తుందని, ప్రమాదాలను అరికట్టవచ్చన్నది పోలీసుల ఉద్దేశం.
ఈ ఆలోచన మంచిదే. కాకపోతే., అది కాస్త అపహాస్యం పాలవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు 100 నెంబర్ని జనం ఎంత జోక్‌గా తీసుకుంటున్నారో చెప్పడానికి సాక్ష్యాలుగా మారాయి.
దిశ ఘటన జరిగిన తరవాత… 100 నెంబర్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఓ ఛానల్ ప్రయత్నించింది. రోడ్డుమీద నిలబడిన అమ్మాయి 100కి ఫోన్ చేసి – ‘నాకు భయంగా ఉంది.. మీరు ఇక్కడికి రాగలరా’ అంటూ పోలీసులను వేడుకుంది. ‘5 నిమిషాల్లో అక్కడ ఉంటాం’ అని చెప్పిన పోలీసులు… ఇచ్చిన మాట ప్రకారం 5వ నిమిషం స్పాట్ కి చేరుకున్నారు. ఇదంతా కెమెరాలో రికార్డు చేసింది ఆ ఛానల్. ఆ తరవాత దాన్ని టెలీకాస్ట్ చేసింది. అక్కడికి వచ్చిన పోలీసులకు ‘ఇదంతా ఉత్తుత్తిదే.. అసలు మీరు వస్తున్నారో లేదో తెలుసుకుందామని టెస్ట్ చేశాం’ అని చెప్పింది న్యూస్ ప్రెజెంటర్. దాంతో పోలీసులు ఖంగుతిన్నారు. మీడియా చూపించింది అత్యుత్యాహమే అయినా.. పోలీసులు కామ్‌గా వచ్చేశారు.
ఆదివారం హైదరాబాద్ నగరంలో ఇలాంటి మరో ఘటన జరిగింది. బస్ స్టాప్‌లో నిలబడిన ఓ అమ్మాయి… 100కి ఫోన్ చేసింది. ‘ఇక్కడ నన్ను ఓ ఆకతాయి వేధిస్తున్నాడు` అంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులేమో హుటాహుటిన స్పాట్ కి చేరుకుని ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాక మాత్రం ‘మేమిద్దరం రాజీకి వచ్చేశాం వదిలేయండి’ అని చెప్పింది ఆ యువతి. దాంతో పోలీసులు ఆ కుర్రాడ్ని వదిలేశారు.
ఇలా… 100ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వాడుకుంటున్నారు. సిల్లీగా తీసుకుంటున్నారు. ఇలా జరిగితే… నిజంగానే ఏదో సమస్యలో పడి 100 నెంబరుకి కాల్ చేసిన అమ్మాయిల పరిస్థితేమిటి? దాన్ని పోలీసులు సిల్లీగా తీసుకునే ప్రమాదం లేదా? దిశ వంటి ఘటన మరోటి జరిగినా, అక్కడికి పోలీసులు సకాలంలో రాలేకపోయినా – ఇదిగో ఇలాంటి ఆకతాయి చర్యలు కూడా పరోక్షంగా కారణభూతం అవుతాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది.