తెలంగాణ రాష్ట్ర సమితిలో మరోసారి పదవుల చర్చ మొదలైంది. కొత్త సంవత్సరంలో రెండు రాజ్యసభ స్థానాలు, మూడు శాసన మండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చి మొదటి వారంలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పదవీ కాలం పూర్తి అవుతోంది. ఆయనతోపాటు తెలంగాణ కోటాలో రాజ్యసభకు వెళ్లిన కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ సభ్యుడు ఎమ్.ఎ.ఖాన్ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. విభజనలో భాగంగా ఏపీ కోటాలో కేవీపీ, ఎమ్.ఎ.ఖాన్ రాజ్యసభకి వెళ్లారు. దీంతో ఇప్పుడీ సీట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.
సిట్టింగులకు మళ్లీ సీట్లు దక్కుతాయా లేదా అనేదే ఇప్పుడు చర్చ. కేవీపీ ఖాళీ కావడంతో… ఆయన స్థానంలో కేశవరావుకు మళ్లీ అవకాశం ఇస్తారా అనే చర్చ తెరాస వర్గాల్లో జరుగుతోంది. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేకే సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆయన ఎప్పట్నుంచో సీఎం వెంట ఉంటున్నారు. ఆయనకి మరోసారి అవకాశం దక్కకపోవడం అనే టాపిక్ కే ఉండకూడదు! కానీ, ఈ మధ్య ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా సొంతంగా కేకే కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టాక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని సమయంలో… చర్చలు జరపాలంటూ కేకే చెప్పడం, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మాట్లాడం, ఆ సందర్భంలో తెరాసలో కొంత చర్చకు కారణమైంది. సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారనే అభిప్రాయం కలిగింది. ఆ ప్రభావం కేకే మీద ఉంటుందా, మళ్లీ రాజ్యసభకు పంపిస్తారా, లేదంటే ఏదైనా పార్టీ పదవి మాత్రమే ఇస్తారా అనేది వేచి చూడాలి.
ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల కోసం చాలామంది ఆశావహులే కనిపిస్తున్నారు. కేకే తోపాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మధుసూదనాచారి, పొంగులేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లు రాజ్యసభ స్థానాల ఆశావహుల్లో ఉన్నారు. ఇప్పట్నుంచే ముఖ్యమంత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మూడు ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అవుతున్నాయి. నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్ పదవీ కాలం ముగుస్తోంది. నాయినికి మరోసారి అవకాశం అసాధ్యమనే పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై సీఎం అసంతృప్తితో ఉన్నారని అప్పుడే కథనాలొచ్చాయి. ఈ మూడు స్థానాలకు కూడా గట్టిపోటీ ఉండే అవకాశమే కనిపిస్తోంది. ఖాళీ కాబోతున్న రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇప్పట్నుంచే తెరాసలో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం చేశారనీ, అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసే పనిలో పడ్డారని తెరాస వర్గాలు అంటున్నాయి.