కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ధిక్కరించేలా చేసి.. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఉపఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. మొత్తం పదిహేను స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. అందులో పన్నెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించడం ఖాయం అయింది. కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల.. ఒక్క చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు బాటలో ఉన్నారు. నిజానికి ఈ పదిహేను స్థానాలు.. కాంగ్రెస్, జేడీఎస్ సిట్టింగ్ స్థానాలే. అయినప్పటికీ.. బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఈ ఎన్నికల ఫలితాలతో కర్ణాటకలో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించినట్లయింది.
ఉపఎన్నికలకు ముందు బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ సభ్యుల సంఖ్య 224. మొత్తంగా మ్యాజిక్ మార్క్ 113. వీటిలో… కనీసం.. ఏడు స్థానాలు గెలుచుకుంటేనే బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది. అయితే.. ఇప్పుడు.. అదనంగా మరో ఐదు స్థానాలు గెలుచుకుంది. దీంతో.. కర్ణాటకలో అనిశ్చితికి తెరపడినట్లయింది. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి కట్టినప్పటికీ.. అతి పెద్ద పార్టీ పేరుతో బీజేపీని గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు. కానీ మెజార్టీ చూపించుకోలేక యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ – జేడీఎస్ సర్కార్ ఏర్పడింది.
ఏడాదిన్నర తర్వాత పదిహేడు మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల్ని ధిక్కరించేలా చేసి.. ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టగలిగింది. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడటంతో.. ఉపఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పొత్తుల్లేకుండా విడివిడిగా పోటీ చేశాయి. ఈ పరిస్థితి బీజేపీకి కలసి వచ్చింది. ఉపఎన్నికల్లో జేడీఎస్ తీవ్రంగా నష్టపోయింది. కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ.. ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.