బోయపాటిది మాస్ యాక్షన్ స్కూలు. భద్ర నుంచి, వినయ విధేయ రామా వరకూ ఈ జోనర్‌లోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. అందులోనూ హిట్లూ, ఫ్లాపులు చూశాడు. ఇప్పుడు బాలకృష్ణతో మరోసారి సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా క్లాప్ కొట్టుకుంది. ఇది కూడా బోయపాటి స్టైల్ ఆఫ్ సినిమానే.
ప్రతి దర్శకుడికీ ఓ స్టైల్ ఉంటుంది. దాన్ని మార్చలేం. అదే వాళ్ల బలం. అయితే అదే వాళ్ల బలహీనత మాత్రం కాకూడదు. బోయపాటి బలమే ఇప్పుడు బలహీనతగా మారుతోంది. మాస్, యాక్షన్, ఊకదంపుడు సినిమాలు చూసే రోజులు కావివి. కథలో, కథనంలో ఏదో ఓ కొత్తదనం కోరుకుంటున్నారు. హీరోలు – డైలాగులు దంచుతుంటే చప్పట్లు కొట్టే తరం కాదిది. అందులోనూ కంటెంటే వెదుకుతున్నారు. అలాంటప్పుడు `నువ్వు మాట్లాడితే శబ్దం.. నేను మాట్లాడితే శాసనం` లాంటి డైలాగులు ఏం ఎక్కుతాయి..? కొత్త సినిమాలో బాలయ్య పలికిన తొలి డైలాగ్ ఇది. దానిపైనే క్లాప్ కొట్టారు. ఈ డైలాగ్ ని బట్టే బోయపాటి ఈసారి ఏం చూపించబోతున్నాడో అర్థం అయిపోయతుంది. బోయపాటి తన స్కూల్ ఏమీ మారలేదని తెలిసిపోతోంది.
బోయపాటి దగ్గర రత్నం, వివేక్ అనే ఇద్దరు రచయితలున్నారు. వాళ్లే మాటలు అందిస్తారు. స్క్రీన్‌ప్లే బాధ్యత ముగ్గురూ కలిసి పంచుకుంటారు. ఎప్పుడూ ఒకే టీమ్‌తో పనిచేయడం దర్శకుడికి కలిసొచ్చే అంశం. కాకపోతే అక్కడే మొనాలిటీ వచ్చేస్తుంది. బోయపాటి ఎలా ఆలోచిస్తాడో, ఆ టీమ్ కూడా అలానే ఆలోచిస్తుంది. దాంతో కొత్తదనం మిస్ అవుతుంది. ప్రస్తుతం అగ్ర దర్శకులుగా చలామణీ అవుతున్నవాళ్లంతా టీమ్‌ని తరచూ మార్చుకుంటూ వెళ్తుంటారు. అంతెందుకు… కొరటాల శివ కూడా చిరంజీవి సినిమా కోసం ఇప్పుడు తన టీమ్‌ని మార్చాడు. రాజమౌళి కూడా తన టీమ్‌లోకి బుర్రా సాయిమాధవ్‌ని చేర్చుకున్నాడు. బోయపాటి మాత్రం ఆ స్కూల్ నుంచి బయటకు రావడం లేదు. ఒకే జోనర్, ఓకే టీమ్. అందుకే ఎప్పుడూ అవే కథలు, అవే సన్నివేశాలు పుట్టుకొస్తున్నాయి. వినయ విధేయ రామా లాంటి డిజాస్టర్ తరవాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా ఇది. కనీసం ఈ సినిమా విషయంలోనైనా బోయపాటి కాస్త మారాల్సింది. లేదంటే రేపు రాబోయే ఫలితాలూ మారవు.