మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వారిపై… మొదటి వారంలో విచారణ , రెండో వారంలో ట్రయిల్, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. “దిశ” ఘటన నేపధ్యంలో.. అసెంబ్లీలో మహిళల భద్రతపై.. స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో జగన్మోహన్ రెడ్డి.. భావోగ్వేదానికి గురయ్యారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా.. ఆ ఘటనపై తానెంత చలించిపోయానో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలంటే.. అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్షలు పడాల్సి ఉందన్నారు.
తెలంగాణలో జరిగిన “దిశ” అత్యాచారం, హత్య ఘటన విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సమర్థించారు. దారుణానికి పాల్పడ్డవారిని కాల్చేసినా కూడా తప్పులేదని అందరూ అనుకున్నారని… వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కేసీఆర్‌కు.. తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఎన్కౌంటర్ చేయడాన్ని ఖండిస్తున్న వారిపై జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలను నిర్ధారించడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పైనా జగన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎక్కడ నుంచో దిగిపోయారని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌ను జగన్ పూర్తి స్థాయిలో సమర్థించారు. న్యాయస్థానాల్లో శిక్షలు ఆలస్యమవుతున్నందున.. అలాంటి శిక్ష విధించడం కరెక్టేనని..జగన్ తన ప్రసంగంగా ద్వారా చెప్పకనే చెప్పారు.
సీరియస్‌గా జరిగిన చర్చలో.. రాజకీయ విమర్శలు, వ్యంగ్యాన్ని జగన్ జోడించారు. ఓ సందర్భంలో.. “నాకు ఒకటే భార్య” అంటూ.. వ్యంగ్యాన్ని జోడించారు. పవన్ కల్యాణ్‌పై తరచూ చేసే..భార్యల విమర్శలను గుర్తుకు తెచ్చారు. అలాగే.. గత ప్రభుత్వం హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. చట్టాలు మార్చేందుకు సలహాలు సలహాలు, సూచనలు కోరుతున్నామని.. అయితే ప్రతిపక్షం మాత్రం సలహాలు ఇవ్వడం తప్ప అన్ని విమర్శలు చేశారని ఆరోపించారు.