హైదరాబాద్: ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలపటానికి రాజమండ్రి చేరుకున్న సినీదర్శకుడు దాసరి నారాయణరావును పోలీసులు కట్టడి చేశారు. దాసరి, ముద్రగడను కలవటానికే వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య (విడివిడిగానే) ఇవాళ రాజమండ్రి చేరుకుని ఒక హోటల్లో బసచేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని వారిద్దరినీ బయటకు కదలనీయకుండా కట్టడి చేశారు. హోటల్ చుట్టూ మోహరించారు. ప్రముఖులెవరూ కిర్లంపూడి రావద్దని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖులరాకతో తునిలో జరిగిన విధ్వంసం పునరావృతమవుతుందని పోలీసులు అంటున్నారు. ముద్రగడ తన స్నేహితుడని, ఆయనను కలవటం తప్పా అని దాసరి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్రగడను కలిసి తీరుతానని చెప్పారు. పోలీసులు నిన్నటినుంచి తనను అడ్డుకుంటున్నారని, తనను పాకిస్తాన్ టెర్రరిస్టులాగా చూస్తున్నారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తీసుకోనని చెప్పారు.
మరోవైపు దాసరి మిస్సింగ్ అంటూ ఈ ఉదయం న్యూస్ ఛానల్స్‌లో వార్తలొచ్చాయి. హైదరాబాద్ నుంచి కారులో కిర్లంపూడి బయలుదేరిన దాసరి మధ్యలో సహాయకులను దించేసి ఒక్కరే కారులో వెళ్ళిపోయారని ఆ వార్తల సారాంశం. ఆయన ఫోన్లో కూడా అందుబాటులో లేరని, ఆచూకీ తెలియటంలేదని సహాయకులు చెప్పారట. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఆయన మారువేషంలో కిర్లంపూడి వెళుతున్నారేమోనని ఒక వాదన వినిపించింది.
ఇదిలా ఉంటే చిరంజీవి, రఘువీరారెడ్డి ఈ ఉదయం 11.30 గంటలకు విమానంలో రాజమండ్రి చేరుకోనున్నారు. మరి వారి పరిస్థితి ఏమవుతుందో తెలియటంలేదు. కాంగ్రెస్ నాయకులు రఘువీరా, శైలజానాథ్, కొప్పులరాజు తదితరులు నిన్న రాత్రి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూను కలుసుకుని తాము ముద్రగడను కలవటానికి కిర్లంపూడికి వెళ్ళేందుకు ఆటంకాలు కలిగించొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఆ తర్వాత బయటకొచ్చి, కిర్లంపూడి వెళ్ళటానికి తమకు కమిషన్ ఛైర్మన్ అనుమతించారని మీడియాకు చెప్పారు. మరి ఏమవుతుందో చూడాలి.