ఎవరేమనుకున్నా, ఢిల్లీకి ఎన్ని ఫిర్యాదు చేస్తామనుకున్నా, గ్రూపులు కట్టి పక్కకపెడదామని అనుకున్నా, జూనియర్ అని విమర్శించినా, కొత్త నాయకుడని తక్కువ చేసినా, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా… అన్నీ పట్టించుకోకుండా తెలంగాణ కాంగ్రెస్ ని చక్కదిద్దేది తానే అని స్వయం ప్రకటన చేసుకున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. మల్కాజ్ గిరిలో సొంత ఆఫీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టి. కాంగ్రెస్ కి చెందిన కొంతమంది పెద్దలు హాజరయ్యారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నాశనం (జేసీ వాడిన మాటను యథాతథంగా రాయలేం) చేశారని జేసీ అంటే… కచ్చితంగా రిపేర్ చేస్తా అని రేవంత్ సమాధానం ఇచ్చారు.
మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గ ప్రజలతోపాటు, రాష్ట్రంలో అందరికీ తన ఆఫీస్ అందుబాటులో ఉంటుందన్నారు రేవంత్. ప్రతి శనివారం గ్రీవెన్స్ డే పెట్టాననీ, ఆరోజున తాను ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీస్ లోనే ఉంటానన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా వారి కష్టాలు వినేందుకు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆఫీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. వారంలో మిగతా ఐదు రోజులు రాష్ట్రంలో పర్యటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలపై, కేసీఆర్ దుర్మార్గ పాలనపై పోరాటాలు చేస్తానన్నారు. ప్రతీ కార్యకర్తకీ అండగా నిలబడేలా తన ఆఫీస్ ఉంటుందనీ, ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రతీ ఒక్కరికీ కలించడమే లక్ష్యంగా పెట్టుకున్నా అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు కొంతమందిని రేవంత్ సన్మానించారు.
రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన విజన్ తో ఉన్నట్టు కనిపిస్తున్నారు. తన ప్రాధాన్యతను పార్టీలో తానే పెంచుకునే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. సమస్యలుంటే తన ఆఫీస్ కి రావాలని అంటున్నారు. తెల్లారితే గాంధీభవన్ లో ఉంటున్న పెద్దలు ఈ మాటకు ఎలా స్పందిస్తారో..? ఇప్పటికే రేవంత్ మీద ఓ వర్గం గుర్రుగా ఉంది. ఆఫీస్ ఏర్పాటు, రాష్ట్రంలో పర్యటిస్తానంటూ ప్రకటనలు, కార్యకర్తలు ఇక్కడి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పడం… ఇవన్నీ ఆ వర్గానికి మింగుడుపడని అంశాలు. ఆ రాజకీయాలు ఎలా ఉన్నా… ప్రజల్లోకి వెళ్లడానికి రేవంత్ సిద్ధమైపోయారు. ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతూ ప్రాధాన్యత పెంచుకునే ప్రయత్నాలూ చేస్తూ వస్తే… దానికి భిన్నంగా సొంతంగా సత్తా చాటుకుంటూ పార్టీని తనచుట్టూ తిప్పుకోవడమే రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది.