కేసీఆర్‌ను పొగిడే క్రమంలో.. జగన్మోహన్ రెడ్డి ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారా..? అవుననే అంటున్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఒకప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొంది ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన రఘునందన్ రావు ప్రముఖ లాయర్. న్యాయవాదవర్గాల్లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జగన్‌తో పాటు.. అనేక మంది.. ఎన్కౌంటర్ క్రెడిట్‌ను.. కేసీఆర్‌కు ఇస్తూ ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల కేసీఆర్‌కు.. ముప్పు ఏర్పడిందని.. ఆయన అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా తెలంగాణ మంత్రులు చేసిన తొందరపాటు వ్యాఖ్యలతో ఆ కేసు సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని రఘునందన్ రావు చెబుతున్నారు.
దిశ ఎన్కౌంటర్ కేసు.. ఓ అత్యాచారం, హత్య కేసులో.. విధించిన పనిష్మెంట్గానే సాధారణ ప్రజలు చూస్తున్నారు. కానీ అది చట్టఉల్లంఘనగా … రికార్డులకు ఎక్కుతోంది. ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపడం.. హత్యానేరంతో సమానం. గతంలో ఎన్కౌంటర్లు చేసిన పోలీసులపై మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు.. ఈ ఎన్కౌంటర్ కూడా.. వివాదాస్పదమయింది. హుటాహుటిన.. ఎన్హెచ్ఆర్సీ వచ్చి విచారణ జరిపింది. సుప్రీంకోర్టులోనూ విచారణ జరగబోతోంది. ఈ అంశాలతో పాటు రఘునందన్ రావు మరో కీలక విషయం బయటపెట్టారు. కాల్చి చంపిన వారిలో ఇద్దరు మైనర్లని.. తాజాగా సర్టిఫికెట్లతో వెల్లడయింది. పరీక్షల్లో కూడా.. నిందితులు మైనర్లు అని తేలితే మాత్రం… పోలీసులకు… తెలంగాణ సర్కార్‌కు చిక్కులు తప్పవన్న ప్రచారం ప్రారంభించారు. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రఘునందన్ రావు చెబుతున్నారు.
ఇప్పటికే ఎన్కౌంటర్ .. కేసీఆర్ చెబితేనే జరిగిందన్నట్లుగా.. అందరూ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రులు ప్రారంభించిన ప్రచారాన్ని పొరుగు రాష్ట్ర సీఎం జగన్…హ్యాట్సాఫ్‌తో మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పుడు.. ఈ తొందరపాటే.. చిక్కులు తెచ్చిపెట్టబోతోందంటున్నారు. అదే జరిగితే… జగన్‌కు పోయేదేమీ ఉండదు.. కేసీఆరే ఇబ్బందుల్లో పడతారు.