ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు చూస్తుంటే… మరో ఏడాదిలో ఎన్నికలున్నట్టుగా స్పందిస్తున్నారు! తెలంగాణలో భాజపా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నం రాష్ట్ర స్థాయి నేతలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు పరిధిలో జరుగుతున్నది. దీనిపై ప్రధానమంత్రి ప్రత్యేకంగా స్పందించేయాల్సిన అవసరం ఇప్పుడే ఏముంది..? అది పార్టీ వ్యవహారం కదా? ఇంతకీ జరిగింది ఏంటంటే… తెలంగాణ భాజపా ఎంపీలతోపాటు కొంతమంది నాయకులు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రాబోయేది మన ప్రభుత్వమే అన్నారు.
ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఈసారి మన అభ్యర్థులందరూ గెలుస్తారు, త్వరలో మనం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, దీన్లో ఎలాంటి అనుమానం లేదు, అందరూ సిద్ధంగా ఉండండని అన్నారు ప్రధాని మోడీ. జనంతో ఉండండి, ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తుండండి అని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కారుపై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు కావడం లేదనీ, సాగునీటి ప్రాజెక్టు పనుల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రధానికి చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని ప్రధాని వారికి హామీ ఇచ్చారు.
మోడీ వ్యాఖ్యలు చూస్తుంటే… ఒక ప్రధానిలా కాకుండా, రాజకీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం తప్పులేదుగానీ, ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది కదా. ఇప్పట్నుంచీ ఈ అధికార యావ ప్రదర్శన ఎందుకు..? రేపోమాపో అధికారంలోకి వచ్చేస్తాం అన్నట్టుగా నాయకులకు ప్రధాని చెప్పడం సరైందా..? అధికారంలోకి రావాలన్నదే లక్ష్యమైతే… తెలంగాణను మరింతగా అభివృద్ధి చెయ్యండి, ఎవరొద్దాన్నారు? ఏవో ఒకటో రెండో కేంద్ర పథకాలు అమలు కావడం లేదని ఫిర్యాదుల వల్ల ఏం జరుగుతుంది..? విభజన చట్టంలో హామీలు పెండింగ్ ఉన్నాయి, కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరాని జాతీయ హోదా, విద్యా సంస్థలకు నిధులు, ఉక్కు కర్మాగారం ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ప్రజలు హర్షిస్తారు, భాజపాని ఆదరిస్తారు. అధికారంలోకి రావడమంటే కేవలం పార్టీని విస్తరింపజేసుకోవడమే అనుకుంటే ఎలా..? పార్టీ విస్తరణ అంటే నాయకుల్ని చేర్చుకోవడమో, ఇతర పార్టీలపై దుమ్మెత్తి పోయడమో అనుకుంటే ఎలా..? పార్టీలకు అతీతంగా ప్రధాని వ్యవహరించాలనే నియమాన్ని మోడీ ఎప్పుడో మర్చిపోయారు!