అసెంబ్లీలో తన ప్రస్తావనను వైసీపీ ఎమ్మెల్యేలు పదే పదే తీసుకు వస్తూండటంపై.. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. శాసనమండలిలో తనపై పప్పు.. పప్పు అంటూ… వ్యాఖ్యానించి.. ఆనందం పొందుతున్నారని.. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సంప్రదాయం కాకపోయినా… వారు అలా విమర్శిస్తున్నారంటున్నారు. ఆ విమర్శలు చేస్తున్న మంత్రులు తాను ఉన్న శాసన మండలికి వచ్చి.. ఎందుకు అలాంటి విమర్శలు చేయడం లేదని ప్రశ్నించారు. తాను మండలిలో ఉంటానని.. అక్కడ చేస్తే.. తాను సమాధానం చెబుతానన్నారు. తాను ఎనిమిదేళ్లు అమెరికాలో ఉన్నానని.. తెలుగులో మాట్లాడటం.. ఓ పదం అటూ ఇటూఅవ్వొచ్చన్నారు. తాను జయంతిని.. వర్థంతి అనడం వల్ల… పెట్టుబడులు వెనక్కిపోయాయా..? అమరావతి , పోలవరం ఆగిపోయాయా..? అని ప్రశ్నించారు.
తనను పప్పు అంటున్న వైసీపీ నేతలకు… లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోలను మీడియా ఎదుట ప్రదర్శించారు. జగన్ తెలుగు,ఇంగ్లిష్లో అన్నీ తప్పులే మాట్లాడుతున్నారని.. లెక్కలు కూడా తప్పులు చెప్పిన వీడియోలు అందులో ఉన్నాయి. వాటిని చూస్తే.. ఎవరు పప్పో.. ఎవరు గన్నేరు పప్పో తెలిసిపోతుందని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ గెలవని చోట పోటీ చేసి.. ఓ చరిత్ర సృష్టిద్దామన్న ప్రయత్నం చేశామని… సులువుగా పోటీ చేసే చోట నిలబడదలేదన్నారు. తండ్రి పేరు చెప్పి కాయలమ్ముకోలేదని.. స్పష్టం చేశారు. ఓడినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు నేను దూరం కాలేదు. ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను.
ఉల్లి సమస్యపై నిలదీస్తే.. హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమ్మేశామని చెప్పినా పదే పదే మాకు షేర్లు ఉన్నాయని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్ ధరలు.. సాక్షి పత్రిక ధరలు ఎందుకు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన తన అఫిడవిట్లోనే అనేక సంస్థల్లో షేర్లు ఉన్నాయని చూపించారు. ఆ సంస్థల ఉత్పత్తుల ధరలు పెరిగితే బుగ్గన బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అన్నీ పెంచుతూ పోతానంటే.. ప్రజలు ఏదో అనుకున్నారని.. కానీ ధరలన్నీ పెంచుకుంటూ పోతూండటంతో.. మోసపోయామని ఇప్పుడు ప్రజలు గుర్తించారని మండిపడ్డారు. ఆరు నెలలైనా.. తనపై చేసిన అవినీతి ఆరోపణల్ని గుర్తించలేకపోయారని.. జగన్తో ఎక్కడైనా ముఖాముఖి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.