రొటీన్ కి భిన్నంగా రాజభవన్ దాటి ప్రజల్లోకి పర్యటనకి వెళ్లారు గవర్నర్ తమిళిసై. ప్రజలతో మమేకం అవుతున్నారు! సమస్యలపై మాట్లాడుతున్నారు. కష్టాలు వింటున్నారు, వెంటనే స్పందిస్తున్నారు కూడా! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటించారు. బోడగూడెం అనే గ్రామంలో ఆదివాసీలతో దాదాపు గంటకుపైగా గవర్నర్ మాట్లాడారు. అక్కడి పురి ఇళ్లలోకి వెళ్లారు, అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తరువాత, గిరిజనుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని తెలుసుకుని… గవర్నర్ చలించిపోయారు.
మా గ్రామంలో సొంత ఇళ్లు లేవు, భూమి లేదు, సదువుకున్న పిల్లగాండ్లకు నౌకరీ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నం, సాయం చెయ్యాలి… ఇలా కొంతమంది గిరిజనులు గవర్నర్ తో మాట్లాడుతూ సమస్యలు చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన గవర్నర్… వీరి సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మీ సమస్యలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తా అంటూ హమీ ఇచ్చారు. అంతేకాదు, మమత అనే గ్రామీణ యువతకి అప్పటికిప్పుడు తాత్కాలిక ఎ.ఎన్.ఎమ్.గా పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి… గిరిజనుల మెప్పు పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా గవర్నర్ సందర్శించారు. అక్కడి నుంచి మేడిగడ్డ వెళ్లారు. అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ లను కూడా గవర్నర్ పరిశీలించారు.
గవర్నర్ తమిళిసై తొలి ప్రజాబాట కార్యక్రమం అనుకున్నట్టుగానే సాగుతోంది! గిరిజనుల ఇబ్బందుల్ని తెలుసుకున్నాననీ, ముఖ్యమంత్రికి చెప్తానని గవర్నర్ అనడం విశేషం. ఎందుకంటే, ఈపని చెయ్యాల్సింది స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిందీ, సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిందీ వారే కదా. కానీ, వాళ్లేం చేయడం లేదని గవర్నర్ సందేశం ఇచ్చినట్టు! ఇప్పుడా బాధ్యత గవర్నర్ తీసుకున్నట్టు. అధికార పార్టీ నాయకులకంటే గవర్నర్ బాగా స్పందిస్తున్నారు, మా బాధలు వింటున్నారు అనే అభిప్రాయాన్ని గిరిజనంలోకి తీసుకెళ్లడంలో తమిళిసై సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. గవర్నర్ ప్రజల్లోకి వస్తే ఇంతగా స్పందించగలరా, వెంటనే సమస్యలకు పరిష్కారాలు చూపించగలరా అనే అభిప్రాయాన్ని కలిగించే తొలిదశలో గవర్నర్ సక్సెస్ అయ్యారు. భాజపా అనుకున్నట్టే తమిళసై ప్రజాబాట కార్యక్రమం కొనసాగుతోందని అనుకోవచ్చు!