నాగచైతన్య చాలా అదృష్టవంతుడు.
తాతతో కలిసి నటించాడు.
నాన్నతో సినిమా చేశాడు
అఖిల్‌తో కలిసి ఒక్క ఫ్రేములో అయినా కనిపించాడు.
ఇప్పుడు వెంకీ మామతో స్టెప్పులు వేశాడు.
తన కెరీర్లో అతి ముఖ్యమైన సినిమా వెంకీ మామ. నిజ జీవితంలో మామ అయినవెంకటేష్తో కలిసి నటించడమే కాదు. తొలిసారి మిలటరీ నేపథ్యంలో కథ ఎంచుకున్నాడు. అందుకే ఈసినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. శుక్రవారం వెంకీ మామ థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సందర్భంగా చైతూతో చిట్ చాట్.
కెమెరా ముందు ఒక మామ.. వెనుక ఒక మామతో పనిచేశారు. ఎలా ఉంది అనుభవం…? వాళ్ల నుంచి ఏం నేర్చుకున్నారు?
– ఇద్దరు మామలు నాకు చాలా నేర్పించారు. నేర్చుకున్నాను కూడా. కాకపోతే అది స్పూన్ ఫీడింగ్‌లా నేర్పించిన విషయాలు కాదు. నాకు తెలియకుండానే వాళ్లని కొన్ని విషయాల్లో ఫాలో అవ్వడం మొదలెట్టాను. వర్క్ విషయంలో ఇద్దరూ చాలా సిన్సియర్. ముఖ్యంగా సురేష్ మామ ప్లానింగ్ చాలా బాగుంటుంది.
నిజ జీవితంలోని పాత్రలే తెరపై పోషించారు కదా. అది ఎంత వరకూ హెల్ప్ అయ్యింది?
– వెంకీ మామతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ఆయనతో నా బాండింగ్ చాలా ప్రత్యేకం. అవన్నీ మా పాత్రలకు హెల్ప్ అయ్యాయి. ప్రేక్షకుల దృష్టిలో కూడా మేము మామా అల్లుళ్లమే కదా. అందుకే వాళ్లు త్వరగా కనెక్ట్ అయిపోతారు.
రియల్ లైఫ్‌లో మీ బాండింగ్ ఎలా ఉంటుంది?
– సినిమాలో చూపించినట్టు అల్లరి అల్లరిగా ఉండదు. చాలా రిజర్వడ్‌గా ఉంటాం. పెద్దగా మాట్లాడుకోం. కానీ ఒకరిపై మరొకరికి చాలా ప్రేమ, అభిమానాలు ఉంటాయి. చైతూ కెరీర్లో ఓ పెద్ద హిట్ ఇవ్వాలి అనే తపనతో ఇద్దరు మామలూ పనిచేశారు. దాన్ని బట్టి వాళ్లకు నామీద ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది.
ఈ సినిమాతో మాస్ ఇమేజ్ మరింత పెరుగుతుందనుకుంటున్నారా?
– ఇది మాస్ సినిమా కాదు. ఓ డిఫరెంట్ ప్యాకేజీ. నేనెప్పుడూ చేయని ఆర్మీ పాత్ర చేశాను. ఇప్పటి వరకూ తెరపై కత్తి ఫైట్లు చాలా చూసేశాం. ఇందులో యాక్షన్ ఓ కొత్త తరహాలో ఉంటుంది.
వెంకటేష్‌గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు.. ఇది ఇప్పుడే ఎందుకు కుదిరింది?
– ఆయనతో చేయాలని ఉన్నా – ఎప్పుడూ బయటపడలేదు. మాకో కథ కావాలి. చెబుతారా? అని ఏ దర్శకుడినీ అడగలేదు. కొన్ని అలా మ్యాజిక్‌లా జరిగిపోతుంటాయి. మనం- వెంకీ మామ ఓ మ్యాజిక్‌లా జరిగిన కథలు. కాకపోతే ప్రేమమ్ కోసం ఆయనతో ఒకరోజు పనిచేశాను. అందులో కిక్ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. ఆ సినిమా తరవాత ఫ్యాన్స్‌కి ఎప్పుడు కలిసినా `మామతో ఓ సినిమా చేయొచ్చు కదా` అని చెప్పేవాళ్లు. వాళ్లు ఎంత బలంగా ఆ కోరిక కోరుకుంటున్నారో అర్థమైంది. సురేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయాలని ఎప్పుటి నుంచో అనుకుంటున్నాను. ఈలోగా సురేష్ మామ నాకు కనీసం 20 కథలైనా పంపించారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. చివరికి ఈ రెండు కోరికలూ ఈ సినిమాతో తీరాయి.
మిలటరీ నేపథ్యం ముందు నుంచీ అనుకుంటున్నదేనా.. మధ్యలో ప్లాన్ చేశారా?
– జనార్థన మహర్షి గారు కథ చెప్పినప్పుడు మిలటరీ నేపథ్యం లేదు. కానీ సురేష్‌బాబు గారు, వెంకటేష్గారూ, కోన వెంకట్‌గారు కలిసి చేసిన డిస్కర్షన్స్‌లో అది పుట్టుకొచ్చింది. ఆ ఎపిసోడ్ ఈ సినిమా కలర్ నే మార్చేసింది.
అందుకోసం ఎలాంటి కసరత్తు చేశారు?
-సురేష్ ప్రొడక్షన్ ప్లస్ ఏమిటంటే ప్రీ ప్రొడక్షన్‌కీ పోస్ట్ ప్రొడక్షన్ కీ కావల్సినంత టైమ్ ఇస్తారు. సినిమా మొదలయ్యాక చాలా ఇంట్రాక్షన్స్ జరిగాయి. ఆర్మీ ఆఫీసర్‌తో మాట్లాడాను. కంటోన్మెంట్ ఏరియాకి వెళ్లి.. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందన్న విషయాన్ని గమనించాను.
వెంకీ కామెడీ టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. మరి మీకు ఎలా అనిపించింది?
– నిజమే. ఆయన కామెడీ టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. నేనైతే చాలా టేకులు తీసుకున్నాను. సెట్లో చాలాసార్లు నవ్వేశాను. నిజంగా జనాలంతా ఇది మల్టీస్టారర్ సినిమా అనుకుంటున్నారు. నేనైతే వెంకటేష్‌గారి సినిమాలో నేనో పాత్ర చేశాను అనుకుంటున్నానంతే. ఎందుకంటే ఆయనకు నేను పెద్ద అభిమానిని. ముఖ్యంగా ఆయన నాకు మామ. ఆయన ముందు నేను హీరోలా ట్రీట్ చేసుకోను.
ఈమధ్య మీ కెరీర్ ప్లానింగు చాలా మారినట్టు అనిపిస్తోంది. కారణం ఏమిటి?
– పరాజయాల నుంచి చాలానేర్చుకుంటాం. నేనూ అంతే. ఎందుకు జరిగింది? తప్పులేం చేశాను? అనేవి జాగ్రత్తగా ఆలోచించుకుంటా. ఈమధ్య సోషల్ మీడియా బాగా పెరిగింది. సినిమా చూడగానే కామెంట్స్ విపరీతంగా పెట్టేస్తారు. వాటిలో మంచి విమర్శలు పట్టించుకోవాలి. నెగిటివిటీ కావాలని రాస్తారు. వాటిని వదిలేయాలి. కొంతమంది నిజాయతీగా రాస్తారు. వాటిని పట్టుకోవాలి.
కొత్త దర్శకులతో పనిచేయడానికి కాస్త వెనుకంజ వేస్తున్నారట కదా?
– వాళ్లపై నెగిటివీటీ లేదు. కొన్ని సినిమాలు వాళ్లతో చేసినా చేసినా వర్కవుట్ అవ్వలేదు. నేను దర్శకుల నటుడిని వాళ్లు నా దగ్గర నుంచి ఎంత రాబట్టుకుంటే అంతా చేస్తాను. కొంతమంది కొత్త దర్శకులు వన్ మోర్ అని అడగడానికి కూడా ఆలోచిస్తారు. అనుభవజ్ఞులు అలా కాదు. వాళ్లకు ఎంత కావాలో బాగా తెలుసు. వచ్చేంత వరకూ వదలరు. కనీసం నా కెరీర్ లో కాస్త నిలకడ వచ్చేంత వరకూ కొత్త దర్శకులకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇది నిజంగా రిస్కే. ఎందుకంటే కొత్త దర్శకుల దగ్గర మంచి కథలు ఉంటున్నాయి. వాటిని నేను మిస్ అవుతున్నాను.
రియలిస్టిక్, సినిమా టిక్… మీకు ఎలాంటి కథలు ఇష్టం?
– రియలిస్టిక్ కథలే చాలా ఇష్టం. కానీ మన ఆడియన్ టేస్ట్‌ని బట్టి రెండూ బాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే కెరీర్ సరిగా ఉంటుంది. వెంకీ మామ ట్రైలర్ చూస్తే కమర్షియల్ సినిమా అనుకుంటారు. కానీ… చాలా మంచి కథ ఉంది. శేఖర్ కమ్ముల సినిమా చాలా సహజంగా ఉంటుంది.