కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు పడదు. ఈ గొడవ చివరకు ఇద్దరి మధ్య పెద్ద అగాధమే సృష్టిస్తుంది. అవమానాలకు, అనర్థాలకు దారి తీస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి-గవర్నర్ మధ్య గొడవ జరిగితే ఎలా ఉంటుందో చెప్పుకోవడానికి పశ్చిమ బెంగాల్ పెద్ద ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-గవర్నర్ జగ్దీప్ ధంకర్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. మమతా బెనర్జీ సంగతి తెలిసిందే కదా. చాలా అగ్రెసివ్ సీఎం. కోపం వస్తే, పట్టుబడితే ఎంత దూరమైనా వెళతారు. తాడోపేడో తేల్చుకునేదాకా వదలరు. పడని వారిపై ఎంత తీవ్రంగా విమర్శలు చేస్తారో, ఆమె చేతలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది అదే.
68 ఏళ్ల ధంకర్ ఈ ఏడాది జులైలో పశ్చిమ బెంగాల్‌కు 28వ గవర్నర్‌గా నియమితుడయ్యారు. ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్య లడాయి మొదలైంది. గవర్నర్ తనతో లడాయి పెట్టుకోవడంతో మమతా బెనర్జీ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సాధారణంగా గవర్నర్ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇదో గౌరవనీయమైన హోదా. గవర్నర్‌తో తనకు సంబంధాలు బాగా లేవు కాబట్టి మమతా బెనర్జీ ఆయనకు తన సత్తా చూపించాలనుకున్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్స్‌లరైన గవర్నర్‌కు ఆ అధికారాలు కత్తిరించేశారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌తో ఛాన్సలర్‌గా గవర్నర్ అధికారాలు రద్దు చేశారు ముఖ్యమంత్రి. యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆ విషయం ఛాన్స్‌లరైన గవర్నరుకు తెలియచేస్తారు. గవర్నరు అప్పుడప్పుడు వీసీలతో సమావేశాలు నిర్వహిస్తారు. స్నాతకోత్సవానికి (కాన్వొకేషన్) హాజరవుతారు. యూనివర్శిటీలకు కొత్త వీసీలను ఆయనే నియమిస్తారు. ఇలా గవర్నరుకు కొన్ని అధికారాలున్నాయి.
ముఖ్యమంత్రి వీటికి ఎసరు పెట్టారు. ప్రస్తుతం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఛాన్స్లర్-వైస్ ఛాన్స్లర్ మధ్య ఏవైనా సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలంటే అదంతా విద్యా శాఖ ద్వారా మాత్రమే జరగాలి. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఛాన్స్‌లరైన తనను సంప్రదించడంలేదని ఈమధ్యనే జగ్దీప్ ధంకర్ ఆగ్రహించారు. కొంతకాలం కిందట జగ్దేవ్పూర్ యూనివర్శిటిలో గొడవ జరిగినప్పుడు విద్యార్థులు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను ఘొరావ్ చేశారు. ఆ సమయంలో ఆయన రక్షణ కోసం గవర్నర్ అక్కడికి వెళ్లారు. అప్పటినుంచి అగాధం ఏర్పడి అది రానురాను పెద్దది అవుతోంది.
ఈ మధ్య గవర్నర్ కోల్‌కతా విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకునే దిక్కు లేదు. వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్ ఆఫీసులకు తాళాలు కనబడ్డాయి. ఇటీవలే గవర్నర్ అసెంబ్లీకి వెళ్లినప్పుడు గేటుకు తాళం వేసి ఉండటంతో ఆయన అక్కడ వెయిట్ చేయాల్సివచ్చింది. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అసెంబ్లీ స్పీకర్ తనను లంచ్ సమావేశానికి రమ్మని పిలిచి, చివరి క్షణంలో దాన్ని రద్దు చేసి తనను అవమానించారని జగ్దీప్ ధంకర్ మీడియాకు చెప్పారు. అసెంబ్లీ మూడో నెంబరు గేటును ఎందుకు క్లోజ్ చేశారు? అంటూ కోపంతో చిందులేశారు. గవర్నర్ అసెంబ్లీలోకి వెళ్లాల్సిన గేటును మూసేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. చివరకు ఆయన మరో గేటు నుంచి అసెంబ్లీలోకి వెళ్లారు.
గతంలో విశ్వవిద్యాలయాల సెనేట్ సమావేశాల గురించి గవర్నర్‌కు ముందుగానే సమాచారం అందేది. ఇప్పుడది కట్ చేశారు. ఏదైనా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కే ఉండేది. సెలెక్ట్ కమిటీ ముగ్గురి పేర్లతో తయారుచేసిన లిస్టును గవర్నర్‌కు ఇస్తే ఆయన అన్ని విషయాలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేసేవారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం దాన్ని రద్దు చేశారు. ఇచ్చిన మూడు పేర్లలో మొదటి పేరునే గవర్నర్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి ఇది జరిగింది. రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ ఇంకా ఎన్ని అధికారాలు కట్ చేస్తారో మరి…! ఆమెతో పెట్టుకుంటే ఇంతే సంగతులు.