కథల్లేక దర్శకులంతా జుట్టు పట్టుకుంటుంటే – వర్మ మాత్రం భలేగా పట్టేస్తుంటాడు. అసలు ఆయన సినిమాలో కథే ఉండదనుకుంటారు గానీ, ఆయనకు ఓ చిన్న పాయింటు చాలు. వర్మ ఫామ్ లో లేకపోవడం, ఆయన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అవ్వడం అన్నీ పక్కన పెడితే, వర్మ ఎప్పుడూ కథ కోసం దేవులాడుకోడు. కథలే తన వెంట పడతాయి. ఇప్పుడు ఆయనకు మరో కథ దొరికింది.
వర్మ సినిమా `అమ్మ రాజ్యంలో – కడప బిడ్డలు` ఈ రోజు విడుదలైంది. అసలు ఈ సినిమా బయటకు వస్తుదా, రాదా? అనే డౌట్ల మధ్య ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోవడం గొప్ప విశేషమే. ఈ సినిమాని ఆపాలని చాలా మంది చూశారట. తన వెనుకే కుట్రలు పన్నార్ట. గోతులు తీశారట. వాళ్లందరి పనీ త్వరలోనే పడతా… అంటున్నాడు. ఈ సినిమాని ఆపడానికి ఎవరెవరు ప్రయత్నించారో, వాళ్లందరిపైనా కేసులు బనాయిస్తానంటున్నాడు. వర్మ అవన్నీ చేస్తాడో లేదో తెలీదు గానీ, తన సినిమా ఆపడానికి చేసే ప్రక్రియ మొత్తం ఓ సినిమా తీస్తాడు. అది మాత్రం గ్యారెంటీ. ఓ సినిమాని ఆపడానికి కొంతమంది ప్రయత్నించడం, దాని వెనుక ఏం జరిగిందో సినిమా తీయడం… భలే వింతగా ఉన్న కన్సెప్ట్. కాదేదీ ప్రచారానికి అనర్హం అని నమ్మే వర్మ – కాదేదీ కథకు అనర్హం అనుకోకుండా ఎలా ఉండగలడు..?