అసెంబ్లీలో చర్చల సంగతి తర్వాత.. ముందు టీడీపీ సభ్యులు అసెంబ్లీ లోపలకు వెళ్లడానికి కూడా కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రతీ రోజూ.. ఓ సమస్యపై నిరసన తెలియజేస్తూ.. అసెంబ్లీకి వెళ్తున్న టీడీపీకి ఈ రోజు మార్షల్స్ షాక్ ఇచ్చారు. టీడీపీ సభ్యులను అసెంబ్లీలోకి వెళ్లనీయలేదు. ఎందుకంటే.. వారి వద్ద ప్లకార్డులున్నాయని చెప్పుకొచ్చారు. ప్లకార్డులు ఉంటే.. అనుమతి లేదని… మార్షల్స్ ఎమ్మెల్యేలను లోనికి పోనీయలేదు. ప్లకార్డులు పక్కన పెట్టేస్తామని చెప్పినా మార్షల్స్ లోనికి పోనీయలేదు. చంద్రబాబు చేతిలో ఉన్న పేపర్లను కూడా పక్కన పడేయాలన్నారు. చీఫ్ మార్షల్ గేటు వద్దనే ఉండి… ఈ అడ్డుకునే వ్యవహారాన్ని పర్యవేక్షించడంతో .. టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో.. టీడీపీ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. చంద్రబాబును కూడా తోసేయడంతో.. ఆయన గేటు వద్దనే కూర్చుని.. నిరసన తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలోనూ రచ్చ జరిగింది.
ప్రశ్నోత్తరాల సమయంలోనే.. అచ్చెన్నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు, ఎమ్మెల్యేలపై మార్షల్స్ చేయి వేశారుృని .. చీఫ్ మార్షల్‌కు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో తెలియదన్నారు. ఈ సందర్భంగా బుగ్గన.. అసెంబ్లీలోకి ప్లకార్డు, బ్యానర్లు తీసుకురావద్దని .. టీడీపీ హయాంలోనే రూల్స్ తీసుకొచ్చారన్నారు. అయితే.. గత ఐదేళ్లలో వైసీపీ సభ్యులు ఎప్పుడూ ప్లకార్డులు తీసుకురాలేదా.. అని అచ్చెన్న ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మార్షల్స్‌పైనే చంద్రబాబు దౌర్జన్యం చేశారని సభలో జగన్ ఆరోపించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పరని తెలుసు.. చంద్రబాబుకు మానవత్వం లేదన్నది వాస్తవమన్నారు. చివరికి మార్షల్స్ ఘటనపై విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ప్రకటించారు.
శాసనమండలిలోలనూ మార్షల్స్ తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను అడ్డుకునే అధికారం మార్షల్స్‌కు ఎవరిచ్చారని లోకేష్ ప్రశ్నించారు. మహిళా సభ్యుల పట్ల మార్షల్స్ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దీంతో.. సభ్యుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరికాదని .. సభ్యులను మార్షల్స్ అగౌరవ పరచకుండా రూలింగ్ ఇస్తున్నానని శాసనమండలి చైర్మన్ ప్రకటించారు. సభ్యులను తనిఖీ చేయడం వంటి చర్యలు ఉండకూడదన్నారు. అసెంబ్లీ చీఫ్ మార్షల్‌ను ఛాంబర్‌కి పిలిచి ఉదయం జరిగిన ఘటనపై వివరణ తీసుకున్నారు.