హైదరాబాద్: హీరో నారా రోహిత్ వ్యవహారాలన్నీ తానే చూస్తానని, అతనితో సినిమా తీయబోతున్నానని చెప్పి అనేకమంది దగ్గరనుంచి కోట్ల రూపాయలు తీసుకుని టోకరా పెట్టిన తాడికొండ సాయికృష్ణ అనే టీఎన్ఎస్ఎఫ్(తెలుగునాడు విద్యార్థిసమాఖ్య) నేత వ్యవహారం ఇవాళ విజయవాడలో బయటపడింది. విజయవాడ గొల్లపూడి ప్రాంతానికి చెందిన సాయికృష్ణ బాధితులు గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవటంతో నిలదీయగా కాల్‌మనీ కింద కేసుల్లో ఇరికిస్తానని అతను బెదిరించినట్లు భవానీపురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నారా రోహిత్ సినిమాల ఆడియో ఫంక్షన్లు, ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటానని అతను చెబుతూ వచ్చాడని, ఫోన్‌ను స్పీకర్లో పెట్టి నారా రోహిత్‌తో కూడా మాట్లాడుతూ ఇవతలివాళ్ళకు వినిపించేవాడని, నమ్మించి కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాడని చెబుతున్నారు. డబ్బులగురించి నిలదీసినపుడు, విజయవాడ సీఆర్డీఏ పరిధిలో భూములకు సంబంధించి ఒక పెద్ద సెటిల్మెంట్ను నారా రోహిత్ ద్వారా చేయబోతున్నామని, అది పూర్తయితే తనకు కోట్ల రూపాయలు వస్తాయని సాయికృష్ణ చెప్పుకొచ్చాడని బాధితులు తెలిపారు. అయితే ఎంతకాలం గడిచినా అతను డబ్బులు ఇవ్వకపోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు ఈ వార్తలు రాగానే నారా రోహిత్ శరవేగంగా స్పందించారు. సాయికృష్ణ డబ్బులు వసూలు చేయటానికి తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ తనకు అభిమానిగా మాత్రమే తెలుసని చెప్పారు. సాయికృష్ణకు నారా రోహిత్‌తో పరిచయం అయితే బాగానే ఉన్నట్లు అతని ఫోటోలనుబట్టి తెలుస్తోంది. నారా రోహిత్‌తో సన్నిహితంగా ఉన్నవి, నారా లోకేష్, నారా రోహిత్ మధ్య నిలుచుని ఉన్నవి అనేక ఫోటోలు బయటకొచ్చాయి.