మన రాజకీయ నాయకులు ఇక మారరు. సంస్కారయుతంగా మాట్లాడలేరు. వీరికి విమర్శలకు, అవమానానికి తేడా తెలియదు. చట్టసభలో అడ్డమైన భాష మాట్లాడటం, అడ్డంగా మాట్లాడటం నాయకులకు అలవాటైపోయింది. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరపాలి. చర్చల ఫలితంగా సమస్యలకు పరిష్కారమార్గం దొరకాలి. కాని దీనికి ఏనాడో కాలం చెల్లింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు అంటే కోపం కాదు ద్వేషం. బాబు ఆయనకు ప్రత్యర్థి కాదు ఆగర్భ శత్రువు. అందుకే చంద్రబాబు వయసును, అనుభవాన్ని కూడా జగన్ కేర్ చేయరు. మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. అలాగని మనం చంద్రబాబునేమీ సమర్ధించనక్కర్లేదు. జగన్ గురించి చెప్పుకునేది ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాడో, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా ఎలా అరుపులు, కేకలు వేశారో సీఎం స్థానంలో ఉండి కూడా అరుపులు, కేకలు మానలేదు. ఆనాడు చంద్రబాబును ఎలా అవమానించారో ఇప్పుడు సీఎం స్థానంలో ఉండి కూడా అదే అవమానం చేస్తున్నారు. జగన్ సర్కారు 2430 జీవోను తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ తెచ్చిన జీవోకే ఈయన మార్పులు చేసి ఈ కొత్త జీవో తెచ్చారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించేవిధంగా ఉందనే విమర్శలు వచ్చాయి. సహజంగానే దీన్ని ప్రధాన పత్రిపక్షం తెలుగుదేశం ఎండగట్టింది. అసెంబ్లీలోనూ లేవనెత్తింది. ఈ జీవో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేది కాదని చెప్పిన జగన్ ”ఇంగ్లిషు వచ్చినవారు ఎవరు చదివినా జీవో స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు ఇంగ్లిషు రాదేమో. జీవోలో భావం అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో” అంటూ అవమానకరంగా మాట్లాడారు.
దీనికి బాబు స్పందిస్తూ ”నాకు ఇంగ్లిషు రాదంటున్న ముఖ్యమంత్రి ఎక్కడ చదువుకున్నారో వెల్లడించాలి. ఆ కాలేజీ పేరు చెబితే అక్కడికి వెళ్లి నేర్చుకుంటా. నన్ను నిందిస్తున్నారు. నేషనల్ మీడియా వాళ్లకు ఈయనే భాష నేర్పారా? వారంతా ఈ జీవోపై నిరసన వ్యక్తం చేస్తున్నారు” అన్నారు. చంద్రబాబుకు ఇంగ్లిషు రాదని విమర్శించడం జగన్‌కు అలవాటు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇంగ్లిషు పేరుతో బాబును అవమానించారు. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను ఉద్దేశించి ఈయన జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశాడా? రాస్తే ఎప్పుడు, ఎక్కడో రాశాడో చెప్పాలని వ్యంగ్య బాణాలు విసరడం, దానికి జగన్ తాను చంద్రబాబు మాదిరి వచ్చీరాని ఇంగ్లిషు నేర్పే స్కూళ్లలో చదవలేదని, బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివానని, టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యానని రెచ్చిపోయారు.
చంద్రబాబు ఎంఫిల్ చదవకుండానే చదివానని చెప్పుకుంటున్నారని కూడా అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా బాబుకు ఇంగ్లిష్ రాదన్నాడని జగన్ అసెంబ్లీలో చెప్పారు. బాబును ప్రజల్లో చులకన చేయడానికి జగన్ ఎంచుకున్న మార్గాల్లో ఇంగ్లిషు ఒకటి. జగన్ పరీక్షలు రాయలేదనడం, చదువుకోలేదనడం ఎంత తప్పో, చంద్రబాబుకు ఇంగ్లిషు రాదని అదే పనిగా ప్రచారం చేయడమూ అంతే తప్పు. గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఇంగ్లిష్ రాకపోవడంవల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఇంగ్లిష్‌లో చాలా పూర్ అని, ఆ భాషను అర్థం చేసుకోలేరని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులతో హోదా గురించి ఇంగ్లిష్‌లో సరిగా చెప్పలేదని, బాబుకు ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకవపోవడం వల్లనే కేంద్రం పట్టించుకోవడంలేదని, హోదాపై బాబు ఇంగ్లిషులో చెప్పేదాన్ని ఇతర పార్టీలవారు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు.
ఇంగ్లిష్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయనకుంటున్న జగన్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటంలేదు? బాబు ఇంగ్లిష్ పూర్ అనే విషయం కొత్తది కాదు. ఆ భాషలో అనర్గళంగా మాట్లాడలేరు. కాని తన రాజకీయ చాతుర్యంతో, పరిపాలనా దక్షతతో ఆ లోపాన్ని మరుగున పడేశారు. పరిపాలనా పరంగా బాబు తప్పులు చేసుండొచ్చు. కాని ‘బెస్ట్ అడ్మినిస్ట్రేటర్’ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇంగ్లిష్‌లో పూర్ కావచ్చు. కాని ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారా? లేదా? 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడని ఎక్కువమంది అనుకున్నారు. కాని చంద్రబాబుకు పట్టం కట్టారు. ఎందుకు? ప్రజలు చెప్పిన కారణం…కొత్త రాష్ట్రానికి చంద్రబాబువంటి అనుభవజ్ఞుడు అవసరమని ఆయన్ని ఎన్నుకున్నామన్నారు. కాని బాబుకు ఇంగ్లిష్ సరిగా రాదు కదా అని అనుకోలేదు.