టీడీపీ సభ్యులను గురువారం మార్షల్స్ అడ్డుకున్నారు. రగడ జరిగింది. దానిపై అసెంబ్లీలోనూ రచ్చ జరిగింది. చంద్రబాబుదే తప్పన్న జగన్.. ఆయనకు క్షమాపణలు చెప్పే గుణం లేదు కాబట్టి.. ఆ విషయాన్ని అంతటితో వదిలేసి.. వేరే అంశాలకు వెళ్దామని స్పీకర్‌కు గురువారం సభలోనే సూచించారు. ఆ ప్రకారం.. వేరే అంశాలపై చర్చ జరిగింది. కానీ ఈ రోజు ఉదయం.. మళ్లీ అదే అంశాన్ని అధికార పక్షం… చేపట్టింది. చంద్రబాబు.. మార్షల్స్ ను తిట్టారని.. మార్షల్స్‌తో అనుచితంగా ప్రవర్తించారని.. వారు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్‌తో ప్రశ్నోత్తరాలు లేకుండానే చర్చ నిర్వహించారు.
మార్షల్స్‌ను నారా లోకేష్ నెట్టి వేశారంటూ ఓ వీడియో.. చంద్రబాబు బాస్టర్డ్ అన్నారంటూ మరో వీడియో ప్రదర్శించారు. వాటీజ్ దిస్ నాన్సెస్ అన్న పదాన్ని బాస్టర్డ్ అన్నట్లుగా చెబుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే.. వారికి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ పెద్దగా ఇవ్వలేదు. వైసీపీ సభ్యులు మాత్రం.. మార్షల్స్ అంశంపై.. టీడీపీ సభ్యులను.. పందికొక్కులు అనే పదం దగ్గర్నుంచి మానసిక రోగులు అనే.. విమర్శ వరకూ.. అన్ని పదాలను వినియోగిస్తూ విమర్శలు గుప్పించారు. సభలోకి రాకుండా మార్షల్స్ ఎందుకు అడ్డుకున్నారని… అసలా అవసరం ఏమిటని.. టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అయితే చంద్రబాబు రావాల్సిన గేటు అది కాదని.. అధికారపక్షం సమాధానం ఇచ్చింది.
మొత్తంగా.. మూడు గంటల పాటు.. నిన్నటి మార్షల్స్ అంశంపై చర్చ జరిగింది. చివరికి.. స్పీకర్… ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మార్షల్స్ తో వ్యవహరించిన విధానానికి క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే.. నిబంధనల ప్రకారం.. ఏం చేయాలో.. సభ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతిపక్షంపై ఏ చర్య తీసుకోవాలో స్పీకర్ కే.. నిర్ణయం అప్పగిస్తూ.. సభ తీర్మానం చేసింది. ప్రతిపక్షంపై చర్య తీసుకునే ఉద్దేశంతోనే.. మళ్లీ ఈరోజు మార్షల్స్ అంశాన్ని సభలో పెట్టారని.. స్పీకర్ ఏదో ఓ చర్య తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.