తెలంగాణలో ఎన్కౌంటర్ తర్వాత ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టు విచారణలు జరుగుతున్నాయని… హత్యాచారం తప్పు అయినా పోలీసులు చేసింది తప్పు అని చెబుతారా అని జగన్ అసెంబ్లీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు చేసింది తప్పు అని చెబితే… శిక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ముందుకు రావని .. అప్పుడు దేశంలో హత్యాచారాలు పెరిగి అరాచకాలు పెచ్చరిల్లుతాయని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ దిశ చట్టంపై అసెంబ్లీలో జరిగిన చర్చలు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని.. దారుణఘటనలు నివారించాలంటే విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచివేసిందన్నారు. హత్యాచార నిందితులను తక్షణమే శిక్ష వేయాలని అందరు కోరుకుంటున్నారన్నారు. దిశ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందని.. సినిమాల్లో అత్యాచారం చేసినవారిని తుపాకీతో కాల్చి చంపితే చప్పట్లు కొడతామని.. .. తెలంగాణలో అదే పనిచేసిన పోలీసులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని జగన్ ప్రకటించారు.
చట్టాల్లో మార్పు వస్తేనే ప్రభుత్వాలను ప్రజలను నమ్ముతారన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి దిశ బిల్లు తీసుకొచ్చామని .. 13 జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. హత్యాచార ఘటనల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే మరణశిక్ష విధిస్తామన్నారు. 7రోజుల్లో దర్యాప్తు, 21రోజుల్లోనే విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడితే జీవిత ఖైదు విధిస్తామని.. సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తే.. రెండు నుంచి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఈ బిల్లును.. హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ సమర్థించింది. బిల్లును..ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది.
దిశ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ , వైసీపీ సభ్యుల మధ్యవాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల్లోని సభ్యులపై ఉన్న వేధింపుల కేసులపై చర్చించుకున్నారు. అఫిడవిట్లు తీస్తే.. జాతకాలు బయటపడతాయని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దానికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. తర్వాత చర్చ సజావుగా సాగింది.