ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెన్షన్ వేటు వేయబోతున్నారన్న ప్రచారం… ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద చక్కర్లు కొట్టింది. దానికి తగ్గట్లుగానే ఉదయం అసెంబ్లీలో రాజకీయం జరిగింది. ప్రశ్నోత్తరాలను నిలిపివేసి.. ముగిసిపోయిన మార్షల్స్ అంశాన్ని అధికారపక్షం అందుకుంది. చంద్రబాబు, టీడీపీ సభ్యులు… మార్షల్స్‌ను తిట్టి కొట్టారంటూ.. సభలో వీడియోలు ప్రదర్శించి ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. ఓ వీడియోను ప్రదర్శింపచేసి..అందులో.. చంద్రబాబు చీఫ్ మార్షల్స్‌ను బాస్టర్డ్ అంటూ తిట్టారని ఆరోపించారు. ఆ తర్వాత వరుసగా… వైసీపీ సభ్యులు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కూడా.. చంద్రబాబు ఆ మాట అన్నారన్నట్లుగానే భావించి.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని.. లేకపోతే.. సభా నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక చంద్రబాబును సస్పెండ్ చేయడమే మిగిలిందని అందరూ అనుకున్నారు. అధికారుల ఏర్పాట్లు కూడా అలాగే జరిగాయి. వందల సంఖ్యలో మార్షల్స్ .. అసెంబ్లీ దగ్గరకు వచ్చారు..ఇక నిర్ణయమే తరువాయి అనుకుంటున్న సమయంలో.. వ్యవహారం అనూహ్యమైన మలుపులు తిరిగింది. వెంటనే.. తెలుగుదేశం పార్టీ నేతలు .. జగన్‌పై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు నో క్వశ్చన్ అన్న..మాటను… వక్రీకరించి జగన్.. బాస్టర్డ్ అన్న అభ్యంతర పదంతో ప్రచారం చేశారని.. హక్కులకు భంగం కలిగించారని… స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్ తో పాటు.. గేటు దగ్గర ఏం జరిగిందో.. వీడియోను చూపించారు. మార్షల్స్‌తో చంద్రబాబు వాగ్వాదం మొత్తం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. నో క్వశ్చన్ అన్న మాటను… అభ్యంతరపదంగా చెబుతూ.. జగన్ తప్పుదోవ పట్టించారని టీడీపీ వివరించింది.
టీడీపీ ప్రివిలేజే మోషన్ ఇచ్చిన తర్వాత పరిస్థితి మారింది. చంద్రబాబుపై సస్పెన్షన్ వేటు వేస్తారన్న ప్రచారం ఆగిపోయింది. చంద్రబాబుపై ఏ చర్య తీసుకోవాలన్నది స్పీకర్ కు నిర్ణయం అప్పగిస్తూ తీర్మానం చేశారు. దాన్ని ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. దిశ బిల్లుపై జరిగిన చర్చలో.. ఉదయం ఘటనల్ని.. టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పిటిషన్‌పై.. మంత్రి కన్నబాబు పరోక్ష ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు మాటలను.. జగన్ వక్రీకరించలేదని… అసెంబ్లీలో ప్రదర్శించిన వీడియో చూసే.. ముఖ్యమంత్రి చెప్పారని.. కవర్ చేశారు. చంద్రబాబు అనని మాటను అన్నట్లుగా చూపి.. ఆయనను సస్పెండ్ చేయాలనుకున్న వ్యూహం బెడిసికొట్టిందని టీడీపీ ప్రచారం ప్రారంభించింది.