తెలంగాణలో బలపడాలనే వ్యూహంలో భాజపా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, బలపడే అవకాశాలు ఉంటాయనే బలమైన నమ్మకంతో కొంతమంది ఇతర పార్టీల నేతలు కమలం గూటికి చేరినవారిలో ఉన్నారు. వారిలో మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఒకరు. రెండు రోజులపాటు ఇందిరా పార్క్ దగ్గర ఆమె దీక్ష చేశారు. దేని గురించి అంటే… దిశ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మద్యమే నేరాలకు కారణమౌతోందనీ, మద్యాన్ని నిషేధించాలంటూ ఆమె దీక్షకు దిగారు. అయితే, మద్య నిషేధం అంత సులువుగా జరిగే వ్యవహారం కాదు. ఇప్పుడు భాజపా ఉద్యమిస్తున్నదీ ప్రజల్లోంచి వచ్చిన ఒక తీవ్ర వ్యతిరేకతను ఒడిసిపట్టిందీ కాదు. ఈ అంశాన్ని ఒక రాజకీయ పోరాటాంశంగా, తెరాసను విమర్శించడానికి పనికొచ్చే ఆయుధంగానే చూస్తోంది. ఉద్యమ స్థాయి కార్యాచరణ ప్రస్తుతానికైతే కనిపించడం లేదు.
రెండ్రోజులపాటు డీకే అరుణ చేసిన దీక్ష ప్రభుత్వంపై కాస్తైనా ఒత్తిడి తెచ్చిందా, ప్రజల్ని ప్రభావితం చేసిందా అంటే లేదనే చెప్పాలి. ఆమె దీక్ష చేస్తుంటే… రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా భాజపా శ్రేణులు చేయలేకపోయాయనీ అనొచ్చు. పార్టీపరంగా భాజపాకి పెద్దగా మైలేజ్ రాలేదుగానీ, వ్యక్తిగతంగా డీకే అరుణకు ఒక సానుకూలంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ సానుకూలతను టి. భాజపా అధ్యక్ష్య పదవి రేసులో తాను ఉన్నానని అరుణ చెప్పుకునేందుకు ఒక అర్హతగా పనికొచ్చే అవకాశం ఉంది. నిజానికి, తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ఏర్పాటు చేయాలనే చర్చ జరుగుతున్నట్టు గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తోపాటు, ఎంపీ అరవింద్ లాంటివారు పోటీలో ఉన్నట్టు చర్చ ఉంది. డీకే అరుణ కూడా తన వంతు ప్రయత్నాల్లో ఉన్నట్టూ వినిపించింది.
కేసీఆర్ మీద ఘాటైన విమర్శలు చేయగలగడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం… ఇవీ ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. అయితే, ఆర్.ఎస్.ఎస్. నేపథ్యం ఉన్నవారికి మాత్రమే పార్టీ అధ్యక్ష్య పదవి అనే సూత్రాన్ని ఈ మధ్య తెర మీదికి తెచ్చారు! ఆ నేపథ్యం అరుణకు లేదు. భాజపాలో ఆమెకి కనీసం ఏడాది అయినా అనుభవం లేదు. ఈ కారణాలతో ఆమెకు అధ్యక్ష్య పదవి నిరాకరించే ఛాన్స్ ఉంది. అందుకే, ఆమె వీటిని దాటి తన సామర్థ్యం ఉంటుందనే సంకేతాలు జాతీయ నాయకత్వానికి ఇచ్చేందుకు ఈ రెండ్రోజుల దీక్ష ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అయితే, మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని ఆమె మరింత ముందుకు తీసుకెళతారో, ఇక్కడితో సరిపెట్టేస్తారో చూడాలి.