వెంకీ మామ శుక్రవారం విడుదలైంది. ఇద్దరు స్టార్ హీరోలున్నా – బలమైన కథ లేదని విమర్శకులు విశ్లేషించేశారు. జాతకాలు అనే రొటీన్ పాయింట్‌ని పట్టుకుని, ఇంకాస్త రొటీన్ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాని నడిపించేశారు. అయితే ఈ మాత్రం కథ వండడానికి చిత్రబృందం చాలా కష్టపడింది. చాలా ఖర్చు పెట్టింది. ఈ కథ తయారవ్వడానికి కోటి రూపాయలు ఖర్చు చేసింది.
జనార్థన మహర్షి తీసుకొచ్చిన కథ ఇది. ఆయన కథ ఇచ్చినందుకు 20 లక్షల వరకూ సమర్పించుకున్నారు. ఆ తరవాత కోన వెంకట్ చేతిలో పడింది. బాబి, కోన వెంకట్, మరో ఇద్దరు రచయితలు కలిసి ఈ కథని సానబెట్టారు. జనార్థన మహర్షి ఈ కథ తెచ్చేటప్పుడు అందులో మిలటరీ ఎపిసోడ్ లేదు. కోన దాన్ని జోడించాడు. రావు రమేష్ ట్రాకు మరో కొత్త రచయిత రాసుకొచ్చాడు. ఇలా కథలో మార్పులు చేర్పులూ చేసినందుకు కోనకు అక్షరాలా 50 లక్షలు ఇచ్చారని టాక్. మిగిలిన రచయితలకు తలో పది పంచినా ఈ కథకు కోటి రూపాయలు అయిపోయింది. అయితే ఎక్కువ మార్పులూ, చేర్పులూ సురేష్ బాబు సూచించినవే. అలా.. పది మంది కలిసి వండిన కథ ఇది. ఇంత మంది వండారు కాబట్టే కలగాపులగం అయిపోయిందేమో..?