వెంకటేష్ – నాగచైతన్య కాంబోలో తెరకెక్కిన `వెంకీ మామ` శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ అందుకుంది. కథలో పస లేదని విశ్లేషకులు తేల్చేశారు. పతాక సన్నివేశాలు మరీ కామెడీగా అనిపిస్తున్నాయి. చనిపోయిన మావయ్య దగ్గరకు అల్లుడు వచ్చి..`మామా..` అని పిలవడంతో మావయ్య కళ్లు తెరుస్తాడు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి క్లైమాక్సులే చూస్తూ వచ్చారు తెలుగు ప్రేక్షకులు. అలాంటి రొటీన్ రొడ్డకొట్టడు క్లైమాక్స్ ఈ సినిమాలో మళ్లీ వాడడంతో సెటైర్లు పడ్డాయి.
నిజానికి ఈ సినిమా కోసం రెండు క్లైమాక్సులు అనుకున్నారు. రెండింటినీ షూట్ చేశారు. ఓ క్లైమాక్స్‌లో వెంకీ పాత్ర చనిపోతుంది. మరో క్లైమాక్స్ మనం చూస్తున్నది. రెండూ షూట్ చేయమని, కావల్సింది వాడుకోవచ్చని నిర్మాత సురేష్ బాబు సూచించారు. దానికి తగ్గట్టు రెండూ తీశారు. కానీ.. మన తెలుగు ప్రేక్షకులకు యాంటీ క్లైమాక్సులు పడవు. పైగా కథ ప్రకారం.. జాతకాన్ని ప్రేమ గెలవాలి. దానికి తగినట్టుగానే క్లైమాక్స్‌ని డిజైన్ చేశారు. కాకపోతే అది మరీ ఓవర్‌గా అనిపించిందంతే.