రెడ్లు అత్యాచారాలు చేస్తే.. ఎన్కౌంటర్లు చేయగలరా..? చేయమని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయగలవా..? ఈ ప్రశ్న చాలా మంది నుంచి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తోంది. దీన్ని ఎమ్మార్పీెస్ నేత మందకృష్ణ.. ఓ ఉద్యమంలా.. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలన్నీ తిరిగి ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఆయన ఇప్పుడు ఎక్కువగా ఏపీలోనే తిరుగుతున్నారు. వెళ్లిన దగ్గరల్లా..జగన్మోహన్ రెడ్డిపై మండిపడుతున్నారు. దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన జగన్మోహన్ రెడ్డి.. హాజీపూర్ లో అమాయక బాలికలను దారుణంగా చంపిన శ్రీనివాస్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయమని ఎందుకు కోరలేదని ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు.. దళితులు, గిరిజనులపై రెడ్లు అత్యాచారాలు చేస్తే.. జగన్, కేసీఆర్ ఎన్కౌంటర్లు చేయించగలరా అని సూటిగా అడుగుతున్నారు.జడ్చర్లలో బాలికను హత్య చేసిన నవీన్‌రెడ్డిని.. ఎన్కౌంటర్ చేయమని కేసీఆర్‌కు జగన్ చెప్పగలడా అని సవాల్ చేశారు. … ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యాచార నిందితులకు.. ఏ శిక్ష వేస్తారో అసెంబ్లీలో జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శలతోనే మందకృష్ణ ఆగిపోలేదు. అత్యాచారాలకు ఉరిశిక్ష విధిస్తూ జగన్ తెచ్చిన చట్టాన్ని స్వాగతిస్తూనే.. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు చట్టం చేయాలంటున్నారు. అత్యాచారాలకు.. సింగపూర్ తరహా శిక్షలంటున్న వారు.. ఆర్థిక నేరాలకు..చైనా తరహా శిక్షలు ఎందుకు కోరరని ప్రశ్నిస్తున్నారు. మంద కృష్ణ వాదనల్లో లాజిక్ ను కొట్టి పారేయలేం. నేరాల పట్ల..నిందితుల పట్ల.. సమాజం స్పందిస్తున్న తీరులో వివక్షనూ తీసిపారేయలేం.