సంబురం అంటే కేసీఆర్…. కేసీఆర్ అంటేనే సంబురం! ఇది ఇప్పటి మాట కాదులెండి. గతంలో అంటే… తెలంగాణ ఏర్పడ్డాక, తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత, తొలి ఐదేళ్లపాటు ఆయన పాలన నిత్య సంబురంగానే ఉండేది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పండుగ స్థాయి, ప్రారంభం ప్రచారం. పాలన తొలి ఏడాది పూర్తయితే అదో పండుగ, మలి ఏడాదికి మరో సందడి, ఇలా ప్రతీయేటా… ఐదేళ్లపాటు కేసీఆర్ పాలన వార్షికోత్సవాల్లా జరుపుకుంటూ వచ్చారు. ప్రతీయేటా… ఆ ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి గురించి మాట్లాడేవారు. తెరాస నాయకుల హడావుడైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే… గత సంబురాల ప్రస్థావన ఎందుకంటే… ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే కదా! కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ముచ్చటగా మాట్లాడటం లేదు? అధికార పార్టీ నాయకులు ఎందుకు సంబురాలు చేసుకోవట్లేదు..?
కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ, ఏడాది పాలన మీద సమీక్ష నిర్వహించాలనే ధ్యాసగానీ, ఊసుగానీ అధికార పార్టీ వర్గాల్లో కనిపించడం లేదు. తొలిసారి అధికారంలో ఉండగా ప్రతీయేటా వార్షికోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ ఉండేది. ఇప్పుడా సంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించడం లేదు? మొదటి టర్మ్ లో వార్షికోత్సవం వస్తే ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా చెప్పుకునే నేతలు, రెండో టర్మ్ కి వచ్చేసరికి వాటి ఊసెత్తడం లేదు? ఏడాది పాలన మీద రివ్యూ నిర్వహణపై పార్టీ అధినాయకత్వం సరే, కనీసం ఎమ్మెల్యేలుగానీ మంత్రులుగానీ ఆసక్తి చూపకపోవడం విశేషం. అధినాయకత్వమే పెద్దగా ఆసక్తి చూపకపోతున్నప్పుడు.. ఎవరు మాత్రం నోరు తెరిచి మాట్లాడగలరు..?
వాస్తవం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు మినహా, రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్తగా చేసినవంటూ ఏవీ లేవు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం, నిరుద్యోగ భృతి, ఖాళీల భర్తీ … ఇలాంటి వాటి ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. రైతు రుణమాఫీ అన్నారు అదీ జరగడం లేదు. రైతుబంధు చెక్కులు కూడా ఇంకా చాలామందికి అందాల్సి ఉంది. కేసీఆర్ గొప్పగా చెబుతూ వస్తున్న ప్రాజెక్టులు కూడా ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాని పరిస్థితి. ఇలా ఎటు చూసుకున్నా… రెండో విడత ఏడాది పాలన సాధించిన విజయాలంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవేవీ లేవు. వాస్తవ పరిస్థితి ఇది కాబట్టి, సంబురాలు చేసుకోవడం సరైంది కాదనే అభిప్రాయం వారికే కలిగి ఉండొచ్చు. ఏదేమైనా, కేసీఆర్ 2.0 సర్కారుకు గత జోష్ లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.