తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహం చెడిపోయిందంటున్నారు… ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ప్రతీ వారాంతంలో ఆయన రాసే కొత్త పలుకులో ఈ వారం విశేషం.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోలికలే. ఉమ్మడి ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ అనుకున్నదానికి జగన్ అంగీకరించలేదని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ ఉమ్మడి ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదు. అందుకే “ఎన్నికల సందర్భంగా నేనెంతో సహాయం చేశాను. అయినా జగన్మోహన్రెడ్డి ఇలా చేస్తారా? అనుభవిస్తాడు..” అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆర్కే చెబుతున్నారు. ఇది తెలిసే.. జగన్.. అసెంబ్లీలో కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఆర్కే విశ్లేషించారు. ఎందుకంటే.. జగన్ ఆర్థిక లావాదేవీలన్నీ… హైదరాబాద్లో ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు.
జగన్ పై కేసీఆర్.. ఓ రకమైన అంచనాలు పెట్టుకున్నారని ఆర్కే తన వ్యాసంలో పదే పదే చెప్పారు. ఆ అంచనా.. జగన్ త్వరలో జైలుకెళ్లడం. తాను జైలుకు వెళ్లకుండా.. జగన్.. బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే.. కేసీఆర్ కు కాస్త దూరం పాటిస్తున్నారు. కానీ.. ఆయన కొంత మంది అధికారుల సలహాల వల్ల.. కేంద్రం వద్ద బ్యాడ్ అయిపోతున్నారంటున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడితోనే ఇంటలిజెన్స్ చీఫ్ గా మనీష్ కుమార్ సిన్హాను నియమించారని ఆర్కే విశ్లేషించారు. ఈ నియామకం వల్ల.. అమిత్ షా ఆగ్రహానికి జగన్ గురయ్యాడని గుర్తు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలనకుంటున్నారని.. ఆ రహస్య ఎజెండా ఏమిటో మాత్రం ఎవరికీ తెలియడం లేదన్న అభిప్రాయం అధికారవర్గాల్లో ఉందంటున్నారు. అధికారులు ఉక్కపోతకు గురవుతున్న విషయాన్ని ఆర్కే హైలెట్ చేశారు. త్వరలోనే అధికారులు బాహాటంగానే నిరసన వ్యక్తంచేసే అవకాశం లేకపోలేదనీ కూడా హింట్ ఇచ్చారు.
టీడీపీ పరిస్థితిని కూడా ఆర్కే విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ తరఫున 23 మంది గెలిచినా, దాదాపు పదిమంది శాసనసభ సమావేశాలలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం తరఫున గెలిచినవారిని తన పార్టీలో నేరుగా చేర్చుకోకుండా .. వారిని తెలుగుదేశం పార్టీకి దూరంచేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఇతరత్రా లొసుగులు ఉన్న ఎమ్మెల్యేలను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. ఈ కారణంగానే అరడజనుకుపైగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీనే పైచేయి సాధిచిందన్నారు. సాక్షి తప్పు రాసిందనిజగన్ చెప్పడం.. ఇతర పత్రికలు చదివితే జ్ఞానం వస్తుందని చెప్పడం లాంటివి దీనికి ఉదాహరణలు అంటున్నారు.