పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా అలజడి రేగుతోంది. ఈశాన్య రాష్ట్రాలు అయితే మండిపోతున్నాయి. ఉభయసభల్లోనూ బిల్లుపాస్ అయిపోయింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇక చేయగలిగిందేమీ లేదన్న ఆలోచన.. ఎవరికీ రావడం లేదు. వ్యతిరేకంగా ఉన్న వారంతా.. రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఈ పోరాటాలు.. ఈశాన్య రాష్ట్రాల నుంచి మెల్లగా.. ఇతర రాష్ట్రాలకు అంటుకుంటున్నాయి. అసలు.. ఎలాంటి సరిహద్దులు.. పౌరసత్వం గొడవలు ఉండని రాష్ట్రాలయిన దక్షిణాదిలోనూ… ముస్లింలు రోజు రోజుకూ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. దీన్ని కూడా రాజకీయం చేయడం ప్రారంభించారు బీజేపీ నేతలు.
ఈ ఆందళనలన్నింటి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీనే ఆరోపించడం ప్రారంభించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించగలిగే పరిస్థితి ఉండి ఉంటే.. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుని ఉండేది. పౌరసత్వ సవరణ బిల్లు.. ముస్లింలలో అభద్రతను పెంచిందనేది వాస్తవం. ఆ బిల్లులో ఉన్న అంశాలు… ముస్లింలందరూ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలన్నట్లుగా ఉందని భావిస్తున్నారు. తమను పరదేశీయులుగా చూసే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయంతో ఉన్నారు. అందుకే చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం.. ఈ పరిస్థితిని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. దేశ ప్రజల్లో కొంత భాగం .. తీవ్ర ఆందోళన గురవుతున్నా.. వారికి తగ్గ భరోసా ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కానీ రాజకీయం మాత్రం చేస్తున్నారు. దీని వల్ల ప్రజల్లో విభజన పెరగడం మినహా.. మరో ప్రయోజనం ఉండదు. కానీ.. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు అంచనా వేసినా… తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేసుకుటూ పోతున్నాయి.