యోగం అంటే అదృష్టం పట్టడం. ఉన్నత స్థానానికి ఎదగడం. బ్రహ్మాండంగా బతకడం. డబ్బు, కీర్తి ప్రతిష్టలు వగైరా సంపాదించుకోవడం..ఇలా చాలా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌కు కొత్త ఏడాదిలో బ్రహ్మాండమైన యోగం పట్టబోతున్నదా? డబ్బు, కీర్తి ప్రతిష్టలు, పార్టీ, ప్రభుత్వ పదవులు…వగైరాలు ఎన్నో ఉన్న కేటీఆర్‌కు ఇంకా ఏం యోగం పడుతుంది? ఇంకా ఆయన ఏం పదవి అలంకరించాలి? అదేనండీ.. ఎంతోకాలం నుంచి అనుకుంటున్న ముఖ్యమంత్రి పదవి. 2020లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఊహిస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు ఈ విషయం చెప్పారట….!
సరే…కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ఏం చేస్తారు? నేషనల్ పాలిటిక్స్‌లోకి వెళతారా? ఇప్పుడు వెళ్లే పరిస్థితులు ఏం ఉన్నాయి? సార్వత్రిక ఎన్నికలు కనుచూపుమేరలో లేవు. కేంద్రంలో ఎన్డీఏ బలంగా ఉంది. కాంగ్రెసు, దాని మిత్రపక్షాలు చేసేది ఏమీ లేదు. మరి కేసీఆర్ పాత్ర ఏముంటుంది? ఆయన పార్టీ ప్రెసిడెంట్‌గా ఉంటారట…! గతంలో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసినట్లుగానన్నమాట. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేశాడు కదా. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చాలాకాలంగా టీఆర్ఎస్లో, ఇతర పార్టీల్లో, జనాల్లో ఉన్న అభిప్రాయం, నమ్మకం, ఊహాగానం కూడా.
కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు విపరీతమైన ప్రచారం జరిగింది. టీఆర్ఎస్లో దీనిపై చర్చ జరిగింది. కేసీఆర్ ప్రధాని అవుతారని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని గులాబీ పార్టీ నాయకులు చాలామంది బహిరంగంగానే చెప్పారు. ‘దేశ్‌కీ నేత కేసీఆర్’ అని కూడా అన్నారు. అప్పట్లో ఇంత ఊపు రావడానికి కారణం తాను ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశ రాజకీయాల్లో దుమ్ముదుమారం లేపుతానని, గుణాత్మక మార్పు తీసుకువస్తానని, దేశ ఆర్ధిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తానని అంటూ కేసీఆర్ ఉరుకులు పరుగులు పెట్టడమే.
కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ పెడతానని, ఎన్నికల్లో బీజేపీ కూటమికి, కాంగ్రెసు కూటమికి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కాబట్టి తాను పెట్టే ఫెడరల్ ఫ్రంట్ కీలకమవుతుందని, రాష్ట్రం పుత్రరత్నానికి అప్పగించేసి కేంద్రంలో తాను చక్రం తిప్పుతానని అనుకున్నారు. వీలైతే ప్రధాని పదవి, కాకుంటే ఉప ప్రధాని చేపట్టాలని ప్లాన్ చేశారు. కాలికి బలపం కట్టుకొని నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెసు ముఖ్యమంత్రులను, కీలక నేతలను కలుసుకున్నారు. కాని కేసీఆర్ అంచనాలు తారుమారయ్యాయి. ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఫెడరల్ ఫ్రంట్ మూలనపడింది.
ఇక టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి కేసీఆరే ముప్పయ్ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, ప్రత్యామ్నాయం లేదని అన్నారు. కొంతకాలం క్రితం కేసీఆర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ మరో రెండు టర్మ్‌లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. తన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉందన్నారు. మరి ఇప్పుడు కొత్త ఏడాదిలోనే కేటీఆర్‌కు పీఠం అప్పగిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి వస్తోందట…! ఆయనపై ఒత్తిడి చేయడానికి కారణమేమిటి? అలా చేసే ధైర్యం నాయకులకు ఉందా? కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించినప్పుడు మీడియావాళ్లు ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చారు. దానికి కేటీఆర్ సమాధానమిస్తూ తనను తాను నిరూపించుకున్నానని, సవాళ్లను స్వీకరించి వాటిని పూర్తి చేశానని చెప్పాడు. పార్టీలో చాలామంది సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారని అంటూ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడయ్యేవాడు కాదన్నారు.
అంటే తనకు సీఎం అయ్యే అర్హత ఉందని పరోక్షంగా చెప్పాడన్నమాట. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ప్రచారం ఉధృతంగా జరిగినప్పుడు మీడియా ప్రతినిధులు మంత్రి హరీష్‌రావును రకరకాల ప్రశ్నలు వేశారు. కేటీఆర్ సీఎం అయితే ఆయన కింద పనిచేస్తారా? అని అడిగినప్పుడు తనకు అభ్యంతరం ఏమీ లేదని, పని చేస్తానని అన్నాడు. కేసీఆర్ ఏం చెబితే అది చేయడమే తన బాధ్యతని అన్నాడు. కాని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం వేరు. ఒకవేళ నిజంగా కేటీఆర్ వచ్చే ఏడాది ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలైనా సంభవించవచ్చు.