రాష్ట్ర సమస్యల్ని కేంద్రంపై నెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదనీ, ఇచ్చుకుంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిలిచిపోయాయంటే కారణం రాష్ట్ర వాటా పన్నుల్ని కేంద్రం చెల్లించకపోవడం అంటున్నారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది అంటున్నారు. నెపాన్ని కేంద్రంపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే… భాజపా కూడా అదే తరహాలో రాష్ట్రంపై విమర్శలు ప్రారంభించింది. వారి బాధ్యత, వారిచ్చిన మాటల్ని తప్పుతూ… తప్పంతా రాష్ట్రానిదే అనే వాదన వినిపించడం వాళ్లూ మొదలుపెట్టారు.
పసుపు బోర్డు తెస్తామని ఎంపీ అరవింద్ మాట తప్పారంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఓట్లేయించుకున్నారనీ, ఇప్పుడు బోర్డుకు మించింది ఇంకేదో తెస్తామని, అదేదో స్పష్టంగా చెప్పకపోతే ఎలా నమ్మాలనేది రైతులు ప్రశ్న. నిజానికి, ఈ అంశాన్ని తెరాస వాడుకుంటే.. రాజకీయంగా నిజామాబాద్ జిల్లాలో రైతుల్ని తమవైపు తిప్పుకునే అవకాశం ఉంది. అయితే, ఆ ఛాన్స్ తెరాసకు ఇవ్వకుండా పసుపు రైతుల సమస్యలకు కేసీఆర్ సర్కారే కారణమంటూ విమర్శలు చేస్తున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు మద్దతు ధర రాకపోవడానికి కేసీఆర్ కారణమన్నారు. మద్దతు ధరను నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎందుకు ప్రపోజల్ పంపించలేదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ పంటల మద్దతు ధరలను నిర్ణయించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిన బాధ్యతల రాష్ట్రాలకు ఉంటుందన్నారు. రాష్ట్రం ప్రతిపాదన పంపితే, వెంటనే అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మద్దతు ధర నిర్ణయించి, ప్రపోజల్స్ తయారు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తానని అరవింద్ చెప్పారు.
వాస్తవానికి, పసుపు రైతులకు బోర్డు తెప్పించి, ఆదుకుంటామని చెప్పి గెలిచారు అరవింద్. అయితే, దాన్ని కేంద్రం నుంచి ఆయన సాధించుకోలేకపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్నదీ ఇదే కదా! రాష్ట్రంలో పాలనా వైఫల్యాలకు తమ హయాం కారణం కాదనీ, కేంద్రానిదే తప్పు అని వేలెత్తి చూపే పనిలో ఉన్నారు. సీఎం వెర్సెస్ భాజపా నేతలు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలకే పరిమితం అవుతున్నారు. కేంద్రం, రాష్ట్రం.. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలకు వారి వైఫల్యాలను వాడుకుంటే, సమస్యలపై వాస్తవ రూపంలో పరిష్కార మార్గం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితి!