ఫలానా నాయకుడి ఫోటోను మార్పింగ్ చేసినందున.. ఫలానా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశాం… అనే పోలీసుల ప్రకటనలు.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ప్రతీరోజూ కనిపిస్తూంటాయి. అయితే.. ఇదే మార్ఫింగ్ కేసుకు సంబంధించి.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ పెట్టిన కేసులో మాత్రం.. రామ్గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు మాత్రమే జారీ చేశారు. ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ.. రామ్గోపాల్ వర్మ తీసిన సినిమాలో కేఏపాల్ను కామెడీగా చూపారు. దీనిపై.. కేఏ పాల్ సీరియస్ అయ్యారు. అమెరికా నుంచి వచ్చి మరీ.. న్యాయపోరాటం చేశారు. హైకోర్టులో పిటిషన్లు వేశారు.
దీంతో.. సినిమా పేరు మార్చాల్సి వచ్చింది. విడుదల రెండు వారాలు వాయిదా పడాల్సి వచ్చింది. విడుదల వాయిదా పడటంతో.. రిలీజైనా.. సినిమాను చూసేవారు లేకుండా పోయారు. అయితే.. ఈ సినిమా పబ్లిసిటీ స్టంట్లలో భాగంగా ఆర్జీవీ వేసిన వేషాలు.. ఆయనపై కేసు నమోదుకు కారణవుతున్నాయి. అన్ని వివాదాలు దాటుకుని.. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఆర్జీవీ… ఫోటోను పోస్ట్ చేశారు. అది కేఏ పాల్ చేతుల మీదుగా.. తాను సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్నట్లుగా ఉంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై పోరాడింది కేఏ పాల్ అయితే.. కేఏపాల్నే సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకిచ్చారన్న అనుమానం చాలా మందికి వచ్చింది.
నిజానికి అది కేఏపాల్ మార్ఫింగ్ ఫోటో. గతంలో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పటి ఫోటోను ఆర్జీవీ మార్ఫింగ్ చేశారు. దీనిపై కేఏపాల్ కేసు వేశారు. పోలీసులు నోటీసులు పంపారు. సామాన్యులకు చట్టం అన్వయిస్తే.. ఈ ప్రకారం.. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ కావాలి. కానీ.. ఇక్కడ ఆర్జీవీ కాబట్టి.. నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ చేస్తారో లేదో మరి..!