చిత్రసీమలో విజయాలెప్పుడూ 10 శాతానికి మించి ఉండవని విశ్లేషకులు చెబుతుంటారు. అది ముమ్మాటికీ నిజం. ప్రతీ యేడాది నూటికి 90 శాతం సినిమాలు బోల్తా కొడుతుంటాయి. ఆ మేరకు నిర్మాతలు నష్టపోతుంటతారు. కొన్ని చిత్రాలైతే మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాయి. సినిమా తీసిన వాళ్లు, కొన్నవాళ్లూ.. తీవ్రంగా నష్టపోతారు. సగం డబ్బులు కూడా వెనక్కి రాని పరిస్థితి. దాన్నే డిజాస్టర్లుగా పిలుస్తుంటారు. 2019లోనూ డిజాస్టర్లు వరుస కట్టాయి. భారీ నష్టాల్ని మిగిల్చాయి. వాటిని ఒక్కసారి రివైండ్ చేసుకుంటే..
జనవరి:
ఈ సంక్రాంతి అంత ఆశాజనకంగా సాగలేదు. ‘ఎఫ్ 2’ ఒక్కటే విజయఢంకా మోగించింది. ఎన్టీఆర్ జీవిత కథగా తెరకెక్కిన ‘కథానాయకుడు’ నందమూరి అభిమానులనే కాదు, తెలుగు చిత్రసీమనీ బాగా నిరాశ పరిచింది. సంక్రాంతి సీజన్లో వచ్చిన బాలయ్య సినిమా ఎప్పుడూ లెక్క తప్పలేదు. కానీ… ‘కథానాయకుడు’ మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తిన్నది. విడుదలకు ముందు ఎంతో హైప్ సృష్టించిన సినిమా ‘వినయ విధేయ రామా’. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. లేదంటే… నిర్మాతలు, పంపిణీదారులు భారీగా నష్టపోవాల్సివచ్చేది. ఫ్లాపు మాట పక్కన పెడితే – దర్శకుడిగా బోయపాటి చాలా విమర్శల్ని, సైటైర్లనీ ఎదుర్కున్నాడు. కొన్ని నమ్మశక్యం కాని యాక్షన్ ఫీట్లు చేయించి.. విమర్శల పాలయ్యాడు.
ఫిబ్రవరి:
ఎన్టీఆర్ ‘కథానాయకుడు’కి కొనసాగింపుగా వచ్చిన ‘మహానాయకుడు’ మరింత దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. ‘కథానాయకుడు’ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో రెండో భాగానికి ఎలాంటి ఆదరణ లేకుండాపోయింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. బాలయ్య కెరీర్లోనే అత్యంత స్వల్పమైన వసూళ్లని అందుకున్న సినిమా ఇదే.
మే:
మార్చి, ఏప్రిల్‌లో తెలుగు సీమ స్థబ్దుగా గడిచిపోయింది. ఊహించని విజయాల్లేవు. అలాగని గట్టి ఎదురుదెబ్బలూ తగల్లేదు. వేసవి సీజన్‌ని సరిగా వాడుకోలేకపోయింది. ఈ సీజన్ అంతా చిన్న, ఓ మాదిరి సినిమాల హడావుడి ఎక్కువగా కనిపించింది. మేలో విడుదలైన ‘సీత’ని డిజాస్టర్‌గా తేల్చేయొచ్చు. తేజ దర్శకత్వం వహించిన సినిమా ఇది. కాజల్ ప్రధాన పాత్రధారి. హీరోయిన్ క్యారెర్టరైజేషన్ కొత్తగా ఉన్నా, మిగిలిన కథలో విషయం లేకపోవడంతో రెండో ఆటకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇదే నెలలో విడుదలైన అల్లు శిరీష్ సినిమా ‘ఏబీసీడీ’ కూడా ఫ్లాపులిస్టులో చేరిపోయింది. ఇలాంటి కథలు ఇక చేయను.. అనే రేంజులో అల్లు శిరీష్ తన అభిమానులకు ఓ లేఖ కూడా రాశాడు. దాన్ని బట్టి ఈ సినిమా స్థాయేంటోఅర్థం చేసుకోవొచ్చు.
జూన్:
ఈ నెలలోనూ చిత్రసీమకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రతీవారం సినిమాలు వస్తూ, పోతున్నా… ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చిన ‘ఓటర్’కి ఈనెలలోనే మోక్షం దొరికింది. కానీ… ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
జులై:
జులైలోనూ పరాజయాల పరంపరకు బ్రేక్ పడలేదు. ఒకట్రెండు హిట్లు పడినా, ఫ్లాపుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. విడుదలకు ముందు చాలా హైప్ తెచ్చుకున్న ‘దొరసాని’… బోర్లా పడింది. ఇక విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ఏమాత్రం మెప్పించలేకపోయింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు ఇది స్పీడ్ బ్రేకర్‌గా మారింది. మైత్రీ మూవీస్ ఈ సినిమాతో భారీగా నష్టపోయింది.
ఆగస్టు:
ఆగస్టులో ఏకంగా మూడు గట్టి ఫ్లాపులు తిన్నది టాలీవుడ్. ‘మన్మథుడు 2’, ‘రణ రంగం’, ‘గుణ 369’… అన్నీ డిజాస్టర్లే. మన్మథుడు టైటిల్‌ని నాగ్ పూర్తిగా పాడు చేసేశాడు. కథ. కథనాలు పేలవంగా ఉండడంతో విమర్శకుల నుంచి చీత్కారాలు తప్పలేదు. రణ రంగంలో భారీదనం కనిపించినా- విషయం శూన్యం. గ్యాంగ్ స్టర్ పాత్ర శర్వానంద్‌కి అస్సలు సూట్ అవ్వలేదు. ఇక గుణ 369లో ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ తప్ప ఏమీ అతకలేదు. ఈ ముడు చిత్రాలూ నిర్మాతల్ని భారీ నష్టాలకు గురి చేశాయి.
సెప్టెంబరు:
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ‘జోడీ’ ఈనెలలోనే విడుదలైంది. సరైన ప్రమోషన్లూ, ప్లానింగూ లేకుండా వచ్చిన సినిమా ఇది. ఫలితం కూడా దానికి తగ్గట్టే వచ్చింది. ఇక నాని ‘గ్యాంగ్ లీడర్’ కూడా ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఓపెనింగ్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది, లేదంటే మైత్రీ మూవీస్‌కి మరో గట్టి దెబ్బ తగిలేది.
అక్టోబరు:
గోపీచంద్‌కి ఈ యేడాది కూడా కలసి రాలేదు. తన కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘చాణక్య’ కూడా దెబ్బకొట్టింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రూపంలో ఎంతో కొంత రాబట్టుకోగలిగారు. థియేటర్ నుంచి వచ్చింది శూన్యమే. తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్ తో నిర్మాతలు రూపాయికి ముప్పావలా పోగొట్టుకున్నారు.
నవంబరు:
రాగల 24 గంటల్లో, జార్జ్ రెడ్డి.. రెండూ ఫ్లాపులే. నవంబరులో చిత్రసీమ నుంచి ఒక్క హిట్లూ దక్కలేదు. వారానికి రెండు మూడు సినిమాలొచ్చినా ఏదీ నిలబడలేదు.
డిసెంబరు:
యేడాదికి చివరి నెల కాబట్టి, ఈ నెలలో సినిమాల హవా మరింత ఎక్కువైంది. అయితే ఈ డిసెంబరులో ఇప్పటి వరకూ ఒక్క హిట్టు కూడా చిత్రసీమ చూడలేదు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన సినిమా ‘భాగ్య నగర వీధుల్లో’. 2 కోట్లతో తీసిన సినిమా ఇది. చివరికి పోస్టరు ఖర్చులూ రాలేదు. ఈ నెలలోనే రూలర్, ప్రతీరోజూ పండగే, ఇద్దరిలోకం ఒక్కటే చిత్రాలు రావాల్సివుంది. మరి వీటి జాతకం ఎలా వుందో..?