పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా… ముస్లింలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. ఆ ప్రభావం.. మెల్లగా దక్షిణాదికి పాకుతోంది. ఏపీలోనూ.. ప్రార్థనల తర్వాత మసీదుల్లో.. ఈ పౌరసత్వ బిల్లుపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లెక్కుతున్నారు. అయితే.. రాజకీయ పార్టీలేవీ.. మద్దతు ప్రకటించేందుకు సిద్దంగా లేవు. అందుకే..వారి ఆందోళనలు పెద్దగా బయటకు రావడం లేదు. ఈ పరిస్థితి.. ముస్లిం వర్గాల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే.. ముస్లిం నేతలు.. తమ పార్టీ విధానానికి అనుగుణంగా నోరెత్తలేకపోతున్నారు. వారు.. సొంత వర్గం నుంచి వస్తున్న విమర్శలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ముస్లింలు సంప్రదాయంగా.. వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో…బీజేపీతో అంటకాగుతున్నారని తెలిసినా.. అది రాజకీయ అవసరం కోసమే.. జగన్ అలా చేస్తున్నారన్న ఉద్దేశంతో.. ఆయనకే మద్దుతు పలికారు ముస్లింలు. అయితే.. ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. లోక్‌సభ, రాజ్యసభలో అనుకూలంగా ఓట్లు వేసింది. కేంద్రం అడగకపోయినా.. తమకు ఉన్న అవసరాల కోసం.. వైసీపీ మద్దతివ్వకతప్పలేదు. దీనిపై.. ముస్లిం వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమయింది. ఓ ముస్లిం సంఘం.. సాక్షి పేపర్‌ను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. ముస్లిం ప్రజాప్రతినిధులు మాట్లాడాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీ కూడా.. ముస్లిం వర్గాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. తమకు ఉన్న పరిమితమైన ఎంపీల బలాన్ని కూడా.. పౌరసత్వ బిల్లుకు మద్దతుగా.. కేంద్రానికి అప్పగించింది. అయితే.. ప్రతిపక్షంలో ఉన్నందున.. టీడీపీకి అంత ఎక్కువ సెగ తగలడం లేదు. కానీ ఆ బిల్లుపై మాత్రం బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో.. ఎలాంటి వివాదాలు పెట్టుకునే పరిస్థితి.. రెండు పార్టీలకు లేదు. అందుకే.. ఏపీలోని ముస్లింల వాయిస్ బయటకు వినిపించడం లేదు. వారు నమ్ముకున్న వారు .. .వారిని నట్టేట ముంచారు. మేమున్నామని చెప్పేవారు నోరు విప్పడం లేదు.