టీడీపీ సభ్యులు బపూన్లలా మాట్లాడుతున్నారని.. వారిని సస్పెండ్ చేసినా తప్పు లేదని.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అసహనానికి గురయ్యారు. జగన్ ఎందుకు అంత అసహనానికి గురయ్యారంటే.. తాము ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులపై చర్చించకుండా.. పారిపోయారని.. టీడీపీ నేతలు ఆరోపించడమే. గత శుక్రవారం.. చీఫ్ మార్షల్‌ను చంద్రబాబు బాస్టర్డ్ అన్నారంటూ.. మూడున్నర గంటలు చర్చ పెట్టారు సీఎం. చివరికి చంద్రబాబు ఆ మాట అనలేదని తేలడంతో సైలెంటయ్యారు. ఆ అసహనం.. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ.. తీసుకొచ్చిన చట్టంపై జరిగిన చర్చలో బయటపడింది.
ఈ చట్టంపై చర్చలో మాట్లాడిన చంద్రబాబు… తాము ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేశామని.. వారికి రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేసి.. జగన్ కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గుంటూరులో ఎస్సీ మహిళపై అత్యాచారానికి సమాధానం చెప్పాలన్నారు. అయితే..చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ద్రోహి చంద్రబాబన్నారు. నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను 1992లో స్థాపించారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అన్నారన్నారు.
ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచారన్నారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించామని పెద్ద ఎత్తునపదవులు ఇచ్చామన్నారు. మార్కెట్ కమిటీల్లో అధికశాతం మైనార్టీలే చైర్మన్‌లుగా ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ సభ్యులంతా… ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల గురించి కాకుండా.. చంద్రబాబు అలా అన్నారని.. ఇలా అన్నారని విమర్శలకే సమయం కేటాయించారు.